గణపతి మన దేవుళ్లలో ప్రత్యేకమైన దేవుడు. ఆయన్ను రకరకాలుగా ఆరాధిస్తారు. ఆయన కోరిన కోర్కెలను తక్షణమే తీరుస్తారని శాస్త్ర ప్రవచనమే కాదు అనుభవంలోకి వచ్చినవారి సంఖ్యకూడా ఎక్కువే. విశిష్ఠమైన ఆధ్యాత్మిక వస్తువులలో శ్వేతార్కమూలం అంటే తెల్ల జిల్లేడు ఒకటి. దీన్ని సాక్షాత్తు గణపతి స్వరూపంగా పరిగణిస్తారు.
అరుదుగా ఒక్కొక్కసారి శ్వేతార్కమూలం (తెల్ల జిల్లేడు) గణపతి ఆకారంలో లభిస్తూ ఉంటుంది. అది మరింత విశిష్టమైనది. శ్వేతార్క గణపతిని పూజించడం వల్ల జాతకంలోని కేతు గ్రహ దోషాలు, వాటి వల్ల కలిగే అనవసర భయాలు తొలగిపోతాయి. ఆర్థిక కష్టాలు, శత్రుబాధలు, రుణబాధలు తొలగిపోతాయి. ఇంట్లోని దుష్టశక్తులు నశిస్తాయి.
ఎలా పూజించాలి?
శ్వేతార్క గణపతిని పూజించే వారికి జ్ఞానం, సంపద, సుఖశాంతులు లభిస్తాయి. తెల్ల జిల్లేడు వేర్ల మీద గణపతి నివశిస్తాడు. తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి, తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు. ఈ మొక్క గనుక ఇంట ఉంటే ధనధాన్యాలు పుష్కలంగా లభిస్తాయట.
ఇంకా ఆ ఇంట వుండేవారి ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా, వారి ప్రయోగాలు పూర్తిగా నశిస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. జిల్లేడు సిరిసంపదలకు చిహ్నం అని నమ్ముతారు. జాతకచక్రంలో సూర్యగ్రహ దోషాలు ఉన్నవారు, జాతకచక్రంలో సూర్యుడు నీచ స్థితిలో ఉన్నవారు ఇంటికి నరదృష్టి ఉన్నవారు, వీధిపోటు ఉన్నవారు, వాస్తుదోషాలతో సతమతమయ్యేవారు సర్వకార్యసిద్ధి కొరకు శ్వేతార్క గణపతిని గృహంలో ప్రతిష్టించి పూజించాలి.
శ్వేతార్క గణపతిని ఇంట్లో ప్రతిష్టించుకునేందుకు సరైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. పురోహితుల్ని సంప్రదించి, వారి సలహా మేరకు ముహూర్తం పెట్టుకుని.. ఇంట శ్వేతార్క గణపతిని ప్రతిష్టించుకోవాల్సి వుంటుంది. ఒకవేళ ఆలయాల్లో శ్వేతార్క గణపతి ప్రతిమను కొనుక్కుని తెచ్చుకున్నట్లైతే పూజగదిలో వుంచి రోజూ నైవేద్యం సమర్పించి పూజ చేసుకుంటే సరిపోతుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతి బుధవారం ఉదయాన్నే శుచిగా శుభ్రం చేసి శ్వేతార్క గణపతిని శుభ్రంగా కడిగి పూజగదిలో ఎర్రని వస్త్రం పై ధూప దీప నైవేద్యాలతో పూజ చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇలా శ్వేతార్క గణపతిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు.