Hyderabad,September 27: వర్షాకాలం సీజన్‌లో దోమల బెడద విపరీతంగా ఉంటుంది. వాటి వల్ల డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇవి విచ్చలవిడిగా ఎక్కడ బడితే అక్కడ నివసించడం.. జానవాసాల్లోకి వచ్చి అందర్నీ కుట్టడం వల్ల పట్టణాల నుంచి పల్లెల వరకు ఆస్పత్రులన్నీ ఎప్పుడూ జ్వర పీడితులో కిటకిటలాడుతుంటాయి.ఇక ప్రధాన హాస్పిటల్స్‌లో సిబ్బంది, ఇతర సదుపాయాల కొరత ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రుల వైపు పరుగులు పెడుతున్నారు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. డబ్బులు కూడా అధికంగానే ఖర్చవుతోంది. ఇప్పుడు వీరికోసం ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ మరియు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ రెండూ కలిసి ఒక వినూత్న పాలసీని అందుబాటులోకి తెచ్చాయి. దోమకాటుకు బీమా కోసం మస్కిటో డిసీస్ ప్రొటెక్షన్ పాలసీ (Mosquito Disease Protection Policy)ని అందుబాటులోకి తీసుకువచ్చాయి.
ఏడు రకాల వ్యాదులు సోకితే..పరిహారం అందించేలా..ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో(HDFC ERGO) జనరల్ ఇన్సూరెన్స్‌లు సంయుక్తంగా ఈ పాలసీని అందుబాటులోకి తెచ్చాయి.ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్( Airtel Payments Bank)ను ఉపయోగిస్తున్న వారికి ఈ పాలసీ అందుబాటులో ఉంటుంది. దాదాపు 40 లక్షల మందికి పైగా తమ ఖాతాదారులకు ఈ పాలసీని అందించనున్నట్లు వెల్లడించింది. రోజు వారి ఆదాయం పొందే వారు, ఒక రోజు ఆస్పత్రిలో ఉన్నా..వారి ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా తయారవుతుందని..ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు ఎండీ, సీఈఓ అనుబ్రతా విస్వాస్ తెలిపారు. ఎలాంటి పత్రాలు లేకుండానే..పాలసీని తీసుకోవచ్చని..వాలెట్ ఇన్సూరెన్స్ పోర్ట్‌పోలియోలో భాగంగా ఈ పాలసీని అందిస్తున్నామని హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ త్యాగి వివరించారు.
ఈ బీమా సౌకర్యం పొందాలంటే ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకులో ఖాతాదారులై ఉండాలి. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు సంవత్సరానికి కేవలం 99 రూపాయల ప్రీమియం చెల్లించి ఈ పాలసీని పొందవచ్చు. ఈ పాలసీ దోమకాటుతో సంభవించే ఏడు రకాల వ్యాధులకు (చికున్ గన్యా, మలేరియా, డెంగీ, మెదడువాపు, కాలా ఆజార్, బోదకాలు, జికా వైరస్) వ్యాధులకువర్తిస్తుంది. ఈ వ్యాధుల బారిన పడి ఒకరోజు ఆస్పత్రిలో ఉంటే గరిష్ఠంగా 10,000 రూపాయల వరకు పరిహారం అందే అవకాశం ఉంది. ఈ బీమా ద్వారా దోమకాటు బారిన పడి ఆస్పత్రిలో ఉన్నవారికి ఆర్థికంగా మేలు జరుగుతుంది. ఈ బీమా పొందటానికి ఎలాంటి పత్రాలు అవసరం లేదని సులువుగానే ఈ బీమా సౌకర్యం పొందవచ్చని తెలుస్తోంది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకులో ఖాతా లేని వారు ఖాతా ఓపెన్ చేసి ఈ సేవలను పొందవచ్చు. పేదలకు, మధ్య తరగతి వర్గాలకు ఈ పాలసీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎయిర్‌టెల్ (Airtel)ప్రతినిధులు చెబుతున్నారు.