Mumbai, Dec 27: దక్షిణ కొరియాలో మరో వ్యాధి కలవరం పుట్టిస్తోంది. ఆ దేశంలో తొలి బ్రెయిన్ ఈటింగ్ అమీబా (Brain-Eating Amoeba) మరణం నమోదు అయ్యింది. దీన్నే నగలేరియా ఫ్లవరీ ఇన్‌ఫెక్షన్ అంటారు. ఈ వ్యాది (Brain-Eating Amoeba Case) సోకి ఆ దేశంలో 50 ఏళ్ల ఓ వ్యక్తి మరణించాడు. అయితే అతనికి థాయిలాండ్‌లో ఆ ఇన్‌ఫెక్షన్ సోకి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
డిసెంబర్ 10వ తేదీన ఆ వ్యక్తి కొరియా వచ్చాడు. అంతకుముందు నాలుగు నెలల పాటు ఆయన థాయ్‌లాండ్‌లో ఉన్నారు. ఈ ఇన్‌ఫెక్షన్ గురించి కొరియా వ్యాధుల నియంత్రణ ఏజెన్సీ పేర్కొన్నది.డిసెంబర్ 10న థాయ్‌లాండ్ నుంచి వచ్చిన వ్యక్తి(50) ఆ మరునాడే ఆస్పత్రిలో చేరాడని, గత మంగళవారం చనిపోయాడని (Kills Korean Man) అధికారులు వివరించారు. దేశంలో ఇదే తొలి కేసు అని దక్షిణ కొరియా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది.ఈ వ్యక్తి నివసించే ప్రాంతంలోని ప్రజలు.. కొలనులు, కాలువల్లోకి దిగి ఈత కొట్టవద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది 1937లో అమెరికాలో తొలిసారిగా వెలుగుచూసింది. ఈ అమీబా కొలనులు, నదులు, కాలువలు, చెరువల్లో ఉంటుంది. మనిషి ముక్కు, నోరు లేదు చెవి ద్వారా లోపలికి ప్రవేశించి మెదడును తినేస్తుంది. ఫలితంగా మరణానికి కారణం అవుతుంది. అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు చాలా తక్కువని నిపుణుల చెప్పారు. అయినా సరే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు అత్యంత అరుదుగా నమోదవుతాయి. 1962 నుంచి 2021 వరకు అమెరికాలో 154 పీఏఎం కేసులు నమోదు అయ్యాయి. దీంట్లో కేవలం నలుగురు మాత్రమే బ్రతికినట్లు సీడీసీ వెల్లడించింది. నగలేరియా ఫ్లవరీ ఇన్‌ఫెక్షన్ మనుషుల నుంచి మనుషులకు సోకదు. ఈ వ్యాధి చికిత్స కోసం కొన్ని డ్రగ్స్ వాడుతుంటారు. ఇక 2018 నాటికి ప్రపంచవ్యాప్తంగా 381 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. అమెరికా, భారత్, చైనాలోనూ ఈ కేసులు నమోదయ్యాయి.
నగలేరియా అనేది ఓ సూక్ష్మజీవి. ఇది ఏక కణ జీవి. సాధారణంగా నదుల్లో, చెరువులు, వాగుల్లోనూ ఈ రకమైన అమీబియా ఉంటుంది. ఈ ఏక కణ జీవులన్నింటికీ ప్రాణాంతక శక్తి ఉండదు. అయితే ఒక్క నగలేరియా ఫ్లవరీ మాత్రం ప్రాణాంతక శక్తితో మనుషులకు సోకుతుంది. అమెరికా అంటువ్యాధుల సంస్థ ప్రకారం.. ముక్కు ద్వారా మనిషి శరీరంలోకి నగలేరియా ప్రవేశించి.. అది బ్రెయిన్‌కు చేరుతుంది.
ఆ తర్వాత అక్కడ ఉన్న నరాలను ఆ అమీబా దెబ్బతీస్తుంది. పీఏఎం అంటే ప్రైమరీ అమీబిక్ మెనింజోఇన్‌సెఫిలైటిస్ అనే వ్యాధికి కారణం అవుతుంది. ఇది ప్రాణాంతకమైన వ్యాధి. అధిక ఉష్ణోగ్రతల సమయంలో ఈ ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా సోకుతుంటుంది. పీఏఎం సోకినప్పుడు తల ముందు భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. జ్వరం, వాంతులు, మెడ పట్టేయడం లాంటి ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. సీరియస్ అయితే అది మానసిక సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది.