Blood Pressure (photo-Pixabay)

వయసు పైబడిన వారిలో రక్తపోటు (బీపీ) తరచూ హెచ్చుతగ్గులకు గురవుతుంటే.. అది మెదడు ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదమని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తోంది. సగటు రక్తపోటు సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ.. బీపీలో తరచుగా జరిగే స్వల్పకాలిక మార్పులు మెదడు కణాల పనితీరును దెబ్బతీసి, మెదడు పరిమాణం క్రమంగా తగ్గిపోవడానికి కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు జర్నల్ ఆఫ్ అల్జీమర్స్ డిసీజ్ (Journal of Alzheimer’s Disease)లో తాజాగా ప్రచురితమయ్యాయి.

ఈ అధ్యయనాన్ని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (University of Southern California)కి చెందిన న్యూరోసైంటిస్టులు నిర్వహించారు. వీరు 55 నుండి 89 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన 105 మంది ఆరోగ్యవంతులైన వృద్ధులను ఎంపిక చేశారు. వారికి MRI స్కాన్లు, రక్త పరీక్షలు చేయడం ద్వారా రక్తపోటులో చోటుచేసుకునే స్వల్ప మార్పులను, వాటి ప్రభావాన్ని విశ్లేషించారు.

పరిశోధనలో శాస్త్రవేత్తలు Average Real Variability (ARV), Arterial Stiffness Index (ASI) అనే రెండు కీలక ప్రమాణాలను ఉపయోగించారు. ఇవి రక్తపోటులో వచ్చే వేగవంతమైన మార్పులను కొలిచే పద్ధతులుగా చెప్పవచ్చు. ఈ రెండు సూచికలు అధికంగా ఉన్న వృద్ధుల్లో, మెదడులో జ్ఞాపకశక్తికి సంబంధించిన హిప్పోక్యాంపస్ (Hippocampus), ఎంటోరినల్ కార్టెక్స్ (Entorhinal Cortex) వంటి భాగాలు కుచించుకుపోయినట్లు MRI ఫలితాలు చూపించాయి.

మధుమేహం రోగులకు గుడ్ న్యూస్, పాదాలకు అయ్యే పుండ్లకు చెక్, గాయాలను వేగంగా మాన్పే సహజ సిద్ధ ఔషధాన్ని కనిపెట్టిన నాగాలాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు

గుండె ప్రతి సారి కొట్టుకున్నప్పుడు బీపీలో స్వల్ప హెచ్చుతగ్గులు రావడం సహజం. కానీ ఈ డైనమిక్ ఇన్‌స్టెబిలిటీ తరచూ ఎక్కువగా జరుగుతుంటే, అది మెదడులోని చిన్న రక్తనాళాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా రక్తప్రసరణ అస్థిరమవుతుంది. నిరంతర రక్త సరఫరా లోపించడంతో మెదడు కణాలకు తగిన ఆక్సిజన్ అందక, అవి దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది. ఈ పరిస్థితి దీర్ఘకాలంలో జ్ఞాపకశక్తి క్షీణత, మతిమరుపు (డిమెన్షియా) వంటి సమస్యలకు దారితీస్తుంది.

ఈ అధ్యయనాన్ని నడిపించిన ప్రొఫెసర్ డేనియల్ నేషన్ మాట్లాడుతూ.. సగటు రక్తపోటు సాధారణంగా ఉన్నప్పటికీ, ప్రతి గుండె కొట్టుకున్నప్పుడు బీపీలో జరిగే సూక్ష్మ మార్పులు మెదడుపై ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఇవే మార్పులు నాడీ కణాల క్షీణత ప్రారంభ దశలో కనిపించే మెదడు మార్పులతో బలమైన సంబంధం కలిగి ఉన్నాయిని వివరించారు.

అదే సమయంలో, రక్త నమూనాల విశ్లేషణలో న్యూరోఫిలమెంట్ లైట్ (Neurofilament Light – NfL) అనే బయోమార్కర్ స్థాయులు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ బయోమార్కర్ సాధారణంగా నాడీ కణాలు దెబ్బతిన్నప్పుడు పెరుగుతుంది. అంటే బీపీ హెచ్చుతగ్గులు కేవలం గుండెకు మాత్రమే కాదు, నాడీ వ్యవస్థకూ నష్టం కలిగిస్తున్నాయని ఇది సూచిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ పరిశోధన వృద్ధుల్లో జ్ఞాపకశక్తి క్షీణతను అంచనా వేయడంలో కొత్త మార్గాన్ని సూచిస్తోంది. భవిష్యత్తులో రక్తపోటు స్థిరత్వాన్ని కాపాడే కొత్త చికిత్సా వ్యూహాలు, జీవనశైలి మార్పులు రూపొందించడానికి ఇది పునాది వేయవచ్చని వారు అంటున్నారు.

రక్తపోటును కేవలం హై లేదా లో స్థాయిలలో మాత్రమే కాకుండా, దానిలో వచ్చే క్షణక్షణ మార్పులను కూడా పర్యవేక్షించడం ఇప్పుడు అత్యవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు రోజువారీ రక్తపోటు తనిఖీలు చేయడం, ఒత్తిడిని తగ్గించే పద్ధతులు పాటించడం, సుస్థిరమైన ఆహారం, వ్యాయామం అలవర్చుకోవడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.