Washing hands | (Photo Credits: Pexels)

'కడుగుతూనే ఉండూ.. కడుగుతూనే ఉండూ, ఏ బంటి నీ సబ్బు స్లోనా ఏంటి'? అంటూ టీవీలో ఎన్నో ప్రకటనలు మిమ్మల్ని చేతులు కడుక్కోమని చెప్తాయి, దానికి మీరేం చేస్తారు? ఛానెల్ మార్చేస్తారు తప్ప వెళ్లి చేతులు కడుక్కోరు. తినే ముందు చేతులు కడుక్కోమని చెప్తే చాలా మంది, తిన్నాక ఎలాగు కడుక్కుంటాం కదా అంటారు. మరికొంత మంది అయితే, 'ముఖ్యమైన కార్యక్రమాలు' నిర్వహించి కూడా చేతులు కడుక్కోకుండా అలాగే వస్తారు 'అవసరమేముంది' అంటారు. వారి చేతుల్తో మీకు షేక్ హాండ్ ఇచ్చి, ఆ తర్వాత మీరు అదే చేతుల్తో భోజనం చేస్తే ఒక్కసారి మీ పరిస్థితి ఊహించుకోండి. అందుకే చేతులు కడుక్కోవటం అనేది ఎంతో ముఖ్యమైనది, చేతులు కడుక్కోవడం ప్రాముఖ్యత గుర్తించి, దీనిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రతీ ఏడాది అక్టోబర్ 15న 'ప్రపంచ చేతులు కడుక్కునే దినోత్సవం' (Global Handwashing Day) నిర్వహిస్తున్నారు. చేతులు కడుక్కోకపోవడం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను నియంత్రించడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

చేతులు పరిశుభ్రంగా ఉంచకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు

అతిసారాన్ని తగ్గిస్తుంది: కడుపులో రోగ క్రిములు ఆవాసం ఏర్పర్చుకోవడానికి అతి ముఖ్యమైన కారణం చేతులను అపరిశుభ్రంగా ఉంచుకోవడం. దీనివల్ల వీరోచనాలు, డయోరియా వచ్చేందుకు ఆస్కారముంటుంది. పరిశోధనల ప్రకారం, చేతులు కడుక్కోవడం వల్ల అతిసారం వచ్చే అవకాశం 23 నుంచి 4 శాతం తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వ్యక్తుల్లో కూడా చేతులు పరిశుభ్ర పరుచుకోవడం ద్వారా డయేరియా రావడం 58 శాతం తగ్గిస్తుంది.

శ్వాసకోశ అనారోగ్యాలను తగ్గిస్తుంది: మీరు తరచూ జలుబు మరియు చీమిడి ముక్కు (sniffles)తో బాధపడుతుంటే, మీరు మీ చేతుల పరిశుభ్రతపై అదనపు శ్రద్ధ వహించాలి. చేతులు పరిశుభ్రంగా ఉంచుకునే వారిలో జలుబు మరియు న్యుమోనియా వంటి శ్వాసకోశ వ్యాధులు 16 నుండి 21 శాతం తగ్గించబడినట్లు కొన్ని అధ్యయనాల్లో వెల్లడించబడింది.

A funny 'hand washing' scene from 'Mahanubhavudu' movie

స్కూల్ డుమ్మా కొట్టడం తగ్గుతుంది:  చాలా మంది పిల్లలు జబ్బు పడి తరగతులను మిస్ అవుతుంటారు. వారికి కామన్ గా వచ్చే అనారోగ్యంపాలైయ్యేది అపరిశుభ్ర అలవాట్ల ద్వారానే. కాబట్టి పరిశుభ్రమైన అలవాట్లను వారికి నేర్పించాలి, పరిశుభ్రమైన అలవాట్లు కలిగిన పిల్లల్లో తరగతుల గైర్హాజరును 29-57 శాతం తగ్గిస్తుందని స్టడీస్ పేర్కొన్నాయి.

కంటి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది: కండ్లకలక వంటి వ్యాధులు అపరిశుభ్రమైన చేతులతో కళ్ళ వద్ద నిరంతరం రుద్దడం ద్వారా వస్తుంది. ఈ కంటి సమస్య వచ్చిన వారి నుండి ఇతరులకు వ్యాపిస్తుంది.

చర్మ వ్యాధులను తగ్గిస్తుంది: చేతులు, పాదాలు మరియు నోటి వ్యాధి, గజ్జి, తామెర వంటి చర్మ వ్యాధులు ఒకరి నుంచి ఒకరిని తాకడం ద్వారా వ్యాపిస్తాయి. శుభ్రమైన చేతులు అంటువ్యాధుల అవకాశాలను తగ్గిస్తాయి.

ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: చేతులను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, శరీరంలో ఉండే వ్యాధినిరోధక శక్తిపై భారం తగ్గుతుంది. సరిగ్గా కడిగిన చేతులు ఎన్నోరకాల అంటువ్యాధులు, కడుపునొప్పి అవకాశాలను తగ్గిస్తాయి తద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కాబట్టి మరీ అతిశుభ్రత పాటించి 'మహానుభావుడు' అనిపించుకోకపోయిన కనీస వ్యక్తిగత శుభ్రత పాటించి జెంటిల్మెన్ అనిపించుకోండి.