నిద్ర లేమి (Sleeping Sickness) కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తాయని మనకు తెలుసు. మధుమేహం, గుండె నాళాలకు సంబంధించిన జబ్బులు, స్థూలకాయం, డిప్రెషన్ వంటి సమస్యల ప్రమాదం నిద్ర లేమి (Sleeping Sickness) కారణంగా ఎక్కువ అవుతుందని ఇప్పటికే నిర్ధారణ అయింది. అయితే ఇప్పుడు కొత్తగా తేలింది ఏమంటే నిద్ర ఎక్కువ అయినా ప్రమాదమేనని. ఆరోగ్యవంతమైన మనుషులకు ప్రతిరోజూ ఆరు నుంచి ఎనిమిది గంటల వరకూ నిద్ర అవసరం. దీర్ఘకాలం పాటు అంతకు మించి నిద్ర పోయిన వారు అకాల మరణానికి గురయ్యే అవకాశం ఎక్కువ ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. కెనడా, ఓంటారియోలోని మెక్‌మాస్టర్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త చుంగ్షి వాంగ్ నాయకత్వంలో ఎనిమిదేళ్ల పాటు ఈ అధ్యయనం జరిగింది. అధ్యయనం ఫలితాలను యూరోపియన్ హార్ట్ జర్నల్ ఇటీవల ప్రచురించింది.
35 నుంచి 70 ఏళ్లలోపు వయసు వారు లక్షా 16 వేల మందిని ఈఅధ్యయనంలో పరిశీలించారు. అధ్యయనం పూర్తయ్యే లోపు వారిలో 4381 మంది మరణించారు. 4,365 మంది గుండెపోటుకు గానీ స్ట్రోక్‌కు గానీ గురయ్యారు. రోజుకు తొమ్మిది నుంచి పది గంటల పాటు నిద్ర పోయే వారికి గుండెపోటు వచ్చే అవకాశం 17 శాతం ఎక్కువని అధ్యయనంలో గుర్తించారు. పది గంటల కన్నా ఎక్కువ నిద్రపోయే వారు గుండెపోటుకు గురయ్యే ప్రమాదం, అకాల మరణానికి లోనయ్యే ప్రమాదం 41 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.