Constipation Causes- Remedies: అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు కారణంగా మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు చాలా సాధారణం. అయితే మీకు తరచుగా ఇలాంటి సమస్య ఎదురవుతుందా? మీ సమాధానం అవును అయితే, ఈ ఆరోగ్యం విషయంలో మీరు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, దీర్ఘకాలిక మలబద్ధకం అనేక తీవ్రమైన సమస్యలకు సంకేతం. ఇది మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మీరు తరచుగా మలబద్ధకం సమస్య ఎదుర్కొంటుంటే వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి.
శరీరాన్ని ఆరోగ్యంగా మరియు ఫిట్‌గా ఉంచడానికి, మీ జీర్ణక్రియ సజావుగా ఉండాల్సిన అవసరం ఉంది, దీర్ఘకాలంగా కొనసాగే ఏ సమస్యనైనా తీవ్రంగా పరిగణించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తరచుగా జీర్ణ సమస్యలు, మలబద్ధకానికి కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు పరీక్షలు చేయించుకోవాలి, ఇది శరీరంలో ఏదైనా తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చునని చెబుతున్నారు. తరచుగా జీర్ణ సమస్యలు తలెత్తడానికి కొన్ని సాధారణ కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఆహారపు అలవాట్లు
చాలా వరకు జీర్ణక్రియ, మలబద్ధకం వంటి సమస్యలకు మీరు తినే ఆహారమే కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధిక నూనె, అధిక కొవ్వు కలిగిన పదార్ధాలు మలబద్ధకానికి కారణమవుతాయి. పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు, స్వీట్లు అధికంగా తీసుకోవడం కూడా సమస్యాత్మకంగా పరిగణించబడుతుంది. ఒకవేళ మీరు వీటిని ఎక్కువగా తీసుకుంటే, మీ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి మీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు, తృణధాన్యాలు చేర్చాలని సిఫార్సు చేస్తున్నారు. ఈ విషయాలు మలబద్ధకం మరియు అజీర్ణం సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
తీవ్రమైన ఒత్తిడి
మలబద్ధకానికి ఒత్తిడి కూడా ఓ కారణమే. అధిక ఒత్తిడి, ఆందోళనలు శరీరంలో అనేక రకాల సమస్యలను పెంచుతాయని తేలింది. ఒత్తిడి అనేది రక్తపోటు, హృదయ స్పందన రేటును పెంచడమే కాకుండా, మలబద్ధకం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. మీరు మల విసర్జన విధానాన్ని నియంత్రించే కండరాలను ఒత్తిడి పరిస్థితులు ప్రభావితం చేస్తాయి. అలాగే దీర్ఘకాలిక మానసిక ఆరోగ్య సమస్యలు తీవ్రమైన జీర్ణ సమస్యలకు దారితీస్తాయి.
అనారోగ్య సమస్యలు
మలబద్ధకం, ఆజీర్తి అనేవి తరచుగా ఇతర ఆరోగ్య సంబంధిత కారణాలను కలిగి ఉంటాయి. మీ మెదడు, వెన్నెముకను ప్రభావితం చేసే పరిస్థితులు, పార్కిన్సన్స్ వ్యాధి, వెన్నుపాము దెబ్బతినడం లేదా మెదడు గాయాలు వంటివి మీ జీర్ణక్రియను కూడా ప్రభావితం చేయవచ్చు. మధుమేహం, థైరాయిడ్ గ్రంథి సమస్యలు కూడా జీర్ణ రుగ్మతలకు కారణమవుతాయి.
వయస్సు ప్రభావం
మీ వయసు పెరిగే కొద్దీ మలబద్ధకం సమస్య కూడా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే మీరు వయస్సు పెరిగేకొద్దీ మీలో చురుకుదనం తగ్గిపోతుంది, అవయవాల పనితీరు బలహీనం అవుతుంది. కాబట్టి వృద్ధాప్యంలో ఎక్కువ జీవక్రియ సమస్యలు ఉండవచ్చు. జీర్ణ సమస్యల నుండి దూరంగా ఉండటానికి, మీ వయస్సుకు తగినట్లుగా తేలికపాటి ఆహారం, కొద్దిపాటి వ్యాయామం, జీవనశైలి మార్పులు అలవాటు చేసుకోవాలి.