Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

New Delhi, June 2: ఈరోజు భారతదేశం కరోనావైరస్ అనే మహమ్మారితో పోరాడుతోంది. ఈ వైరస్ ఎప్పుడు అంతమవుతుందనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే. దాదాపు 70 రోజుల పాటు నాలుగు విడతలుగా విధించిన లాక్డౌన్ ముగిసిపోయినా కూడా వైరస్ ఉధృతి మాత్రం ఇప్పటికీ తీవ్రంగానే ఉంది. దేశంలో ఇప్పటివరకు సుమారు 2 లక్షల మంది కోవిడ్ బారిన పడ్డారు మరియు మరణాల సంఖ్య ఇప్పటికే 5 వేలు దాటేసింది.

కరోనా ఇప్పట్లో నశించే సూచనలు లేకపోవడంతో, వైరస్‌తో కలిసే జీవనం కొనసాగేలా భారత ప్రభుత్వం ప్రజలను సమాయత్తం చేసింది. తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలు అన్నీ తీసుకొని, . ఎవరికి వారుగా స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు సూచిస్తూ జూన్ 1 నుంచి అన్‌లాక్ 1ను అమలులోకి తీసుకువచ్చింది. ఆంక్షలను దాదాపు ఎత్తివేసినా, దీనిని అధికారికంగా 'లాక్‌డౌన్ 5.0' గానే పిలుస్తున్నారు.

అయితే, జనజీవనం మళ్లీ సాధారణ స్థితికి దాదాపు వచ్చేయడంతో ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ ముప్పును తప్పించుకొని ఎలా బ్రతకడం నేర్చుకోవాలో చెబుతూ భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ కె. విజయ్ రాఘవన్‌ను ఉటంకిస్తూ ప్రభుత్వం ఐదు చిట్కాలను విడుదల చేసింది. అవేంటో ఒకసారి పరిశీలించండి.

ఇళ్ళ నుండి బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించండి

ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు, సుమారు 1000 సూక్ష్మ బిందువుల లాలాజలం బయటకు వెదజల్లబడతాయని ఇటీవలి అధ్యయనాలు వెల్లడించాయి. ఆ వ్యక్తికి కరోనావైరస్ సోకినట్లయితే, అతడి ద్వారా కనీసం ఒక మీటర్ దూరం వరకు ఏవైనా సూక్ష్మక్రిములు అతడి లాలాజల బిందువుల రూపంలో గాలిలో తేలుతూ కిందపడతాయి. కాబట్టి ముఖానికి మాస్క్ ధరించడం ద్వారా ఈ ముప్పును తప్పించుకోవచ్చు.

చేతుల పరిశుభ్రత పాటించండి

కరోనావైరస్ సోకిన వ్యక్తుల ఉనికి ఉన్న ప్రాంతాలలో ఉపరితలాలను తాకినప్పుడు లేదా వైరస్ సోకిన వ్యక్తి ఉపయోగించిన వస్తువులు (డోర్ హ్యాండిల్ మరియు వాష్‌రూమ్ ట్యాప్). మనకు తెలియకుండా తాకినపుడు, ఆ చేతులతోనే మళ్లీ మనం ముక్కు, నోరు, కళ్లను తాకినట్లయితే వైరస్ మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి చేతులతో ముఖాన్ని తాకే ముందే ఒక 30 సెకన్ల పాటు సబ్బుతో లేదా శానిటైజర్ తో చేతులను, గోళ్ల సందుల్లో పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఎప్పటికప్పుడు కాళ్లు కూడా కడుక్కోవాలి.

భౌతిక దూరం పాటించండి

శారీరకంగా ధృడంగా, మంచి ఆరోగ్యంతో ఉండేవారికి కరోనావైరస్ సోకినప్పటికీ వారిలో లక్షణాలు కనిపించవు, కానీ వారికి దగ్గరగా ఉంటే వారి ద్వారా మిగతా వారికి వైరస్ వ్యాప్తి చెందుతుంది. కాబట్టి సమూహంలో ఉండకూడదు, తప్పనిసరి పరిస్థితుల్లో ఉండాల్సి వస్తే భౌతికదూరం పాటించాలి.

టెస్టులు మరియు ట్రాకింగ్

ఎవరికైనా పాజిటివ్ గా నిర్ధారణ అయితే వారితో సంబంధం ఉన్న మరియు వారికి సమీపంలో ఉన్న వారందరికీ టెస్టులు నిర్వహించాలి, ఎప్పటికప్పుడు వారి కదలికలపై నిఘా ఉంచాలి. అప్పుడే వారి ద్వారా వైరస్ వ్యాప్తి నియంత్రణ సులభం అవుతుంది.

విడిగా ఉండటం

వైరస్ లక్షణాలు కనిపిస్తే లేదా వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాల నుంచి వచ్చినట్లయితే స్వీయ నియంత్రణలో ఉండాలి. ఎవరితో కలవకుండా 14 రోజుల పాటు ఒంటరిగా ఉండాలి. ఆ లోపు ఆరోగ్య పరిస్థితులు మరింత క్షీణిస్తే ఆసుపత్రికి వెళ్లాల్సిందే.