Representational Image | Credits: Pexels.

చాలా మందికి వ్యాయామం చేయాలని ఉన్నా, అందుకు సరిపడే టైం దొరకడం లేదు. ముఖ్యంగా నగరాల్లో పనిచేసేవారికి వారి వ్యక్తిగత పనులకే అసలు సమయం దొరకడం లేదు. రోజంతా పనిచేసి, ఆ తర్వాత ట్రాఫిక్ గండాన్ని తప్పించుకొని ఇంటికొచ్చి తినేసరికే రోజు గడిచిపోతుంది. పోనీ ఉదయాన్నే నిద్రలేచి జిమ్ కి వెళ్దాం అంటే నిద్ర కరువువుతుంది. దీంతో చాలా మంది వీకెండ్ హాలిడేస్ లో మాత్రమే జిమ్ కి వెళ్లి వ్యాయామాలు చేయడం ఇప్పుడు సరికొత్త ట్రెండ్. వీరికి 'వీకెండ్ వారియర్స్' అనే పేరు కూడా వచ్చింది.

అయితే రోజూ కాకుండా వారాంతంలోనే వ్యాయామాలు చేయడం మంచిదేనా అంటే? మంచిదే అని సమాధానం వస్తుంది. ఎలా అంటే, అసలుకే చేయనపుడు కనీసం వారాంతంలోనైనా శరీరాన్ని ఫిట్ గా ఉంచుకునేందుకు చమటోడ్చటం నయమే కదా అని ఫిట్ నెస్ నిపుణులు చెపుతున్నారు.

ఒక అధ్యయనం ప్రకారం, రోజూ వ్యాయామాలు చేసినా, లేదా వారంలో కేవలం రెండు సార్లు వ్యాయామాలు చేసినా ఫలితాలు ఒకే విధంగా వచ్చాయట. రోజూ వ్యాయామం చేసేవారిలో అలాగే వారానికి రెండు సెషన్లు 75 నిమిషాల నుంచి 150 నిమిషాల వరకు వ్యాయామం చేసిన వారిలో ఇద్దరిలో ఆయిష్షు రేటు 30% పెరిగిందని రీసెర్చీలో వెల్లడింది. ప్రతిరోజు మొక్కుబడిగా వ్యాయామం చేయడం కంటే కూడా ఎంత ఇష్టంతో వ్యాయామం చేస్తున్నాం, మన ఫిజికల్ ఫిట్ నెస్ పట్ల ఎంత ఆసక్తి కనబరుస్తున్నాం అనే దానిని బట్టి మంచి ఫలితాలు వస్తాయి.

అలాగే రోజూ ఒకే విధమైన వ్యాయామాలు చేసేదానికన్నా, మీరు చేసే ఫిజికల్ ఆక్టివిటీస్ లో వైవిధ్యాన్ని చూపిస్తే ఇంకా మంచి ఫలితాలుంటాయి అని చెపుతున్నారు. ఉదాహరణకి ఒక గంట జిమ్ కి వెళ్లి వ్యాయామం చేసే మరో గంట డాన్స్ ప్రాక్టీస్ చేయడం లేదా ఏరోబిక్స్ చేయడం లాంటివి. Monsoon Diet Tips: ఈ వానాకాలంలో ఏమేం తినకూడదో తెలుసుకోండి.

డ్రైవింగ్ చేసుకుంటూ జిమ్ కి వెళ్లేబదులు నడుచుకుంటూ లేదా రన్నింగ్, సైక్లింగ్ చేస్తూ వెళ్లడం. మీ ఫిట్ నెస్ ట్రైనింగ్ లో స్నేహితులను కూడా భాగస్వామ్యం చేస్తే ఒకరికొకరు మోటివేట్ చేసుకుంటూ మరింత సమర్థవంతంగా చేస్తారు.

అయితే ఈ వారాంతంలో వ్యాయామాలు ఎంతవరకు చేయాలి?

వారాంతంలో ఖాళీ సమయం కావాల్సినంత దొరుకుతుంది కాబట్టి కొంతమంది అదేపనిగా జిమ్ లోనే గడిపేస్తున్నారట. వారం రోజులుగా చేయలేనిది ఒక్క వారాంతంలో కవర్ చేసేస్తున్నారట. అయితే జిమ్ లో దండయాత్రలు చేయడం అసలుకే ప్రమాదం అని ఫిట్ నెస్ నిపుణులు చెప్తున్నారు.

ఒకవేళ వారాంతంలో ఎక్కువ సేపు వ్యాయామం చేయాలి అనుకుంటే వారంలో మిగిలిన రోజుల్లో కూడా వార్మప్ చేస్తూ ఉండాలి. కనీసం ఇంట్లో ఉండే మెట్లు ఎక్కుతూ దిగుతుండటం, నడవటం, ఇంటి పనులుచేసుకోవటం. ఇలా శరీరానికి కొంత శ్రమ కలిగించే పనులు చేస్తూ ఉండటం ద్వారా వీకెండ్ లో 3 నుంచి 4 గంటలు జిమ్ చేయడం మంచిది అని సూచిస్తున్నారు.