October 18: కాలం రయ్యిమంటూ పరిగెడుతోంది. కాలంతో పాటే మనం కూడా అంతే వేగంతో పరిగెడుతున్నాం. ఈ నేపథ్యంలో నిద్ర అనేది ప్రధాన సమస్యగా మారింది. టైంకి తిని సమయానికి నిద్రపోవడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టతరమైపోతోంది. రోజుకు కనీసం ఎనిమిది గంటలు కూడా నిద్రపోలేని పరిస్థితి. అయితే కొంత మంది మాత్రం ఖాళీగా ఉంటే ఎప్పుడూ బెడ్ మీదే ఉంటారు. వారి పని తినడం నిద్రపోవడం.. అయితే ఇలా చేయడం చాలా డేంజర్ అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రతి రోజు ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోతే వారి ఆరోగ్యం చెడిపోతుందట.. అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వారి దరి చేరుతాయట. ఈ అలవాటును వెంటనే మార్చుకోవాల్సిందేనని పరిశోధకులు సూచిస్తున్నారు.
మనిషికి నిద్ర ఎంత అవసరమో.. అదే నిద్ర ఎక్కువైతే కూడా అంతే ప్రమాదం ఉంది. రోజులో ఎక్కువగా నిద్రపోవడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మీరు 8 గంటలకు మించి నిద్రపోతే బరువు పెరుగుతారు. అధిక నిద్ర మీ బరువును పెంచుతుంది. చాలా తక్కువ లేదా చాలా ఎక్కువ సేపు నిద్ర పోవడం వల్ల డయాబెటిస్, ఊబకాయంతో సంబంధం కలిగినవన్నీ మీ బాడీకి చేరుతాయి. ఇక బరువు పెరగడం వల్ల శరీర సమస్యలు కూడా పెరుగుతాయి. ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల మెదడు దెబ్బతింటుంది, మొదడు సామర్థ్యం తగ్గుతుంది. అలాగే మెమరీ సామర్థ్యం కొద్ది కొద్దిగా తగ్గడం ప్రారంభమవుతుంది. అలా జరిగితే తెలివితేటలను కూడా ప్రభావితం చేస్తుందని పరిశోధకులు అంటున్నారు.
ప్రస్తుతం ప్రతిఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌ను వదలడం లేదు. ఇంటర్నెట్ వినియోగంతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అర్ధరాత్రి వరకు స్మార్ట్ ఫోన్‌తోనే కుస్తీ. ఇదే నిద్రలేమికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోవాలని, 8 గంటల కంటే ఎక్కువ సమయం పడుకోవడం మంచిది కాదని వైద్యులు తెలియజేస్తున్నారు.