Space Docking Experiment: భారత అంతరిక్ష పరిశోధక సంస్థ(ఇస్రో) శ్రీహరికోట నుంచి చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మక స్పేడెక్స్(స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్) ప్రయోగంలో మొదటి దశ సక్సెస్ అయింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో నుంచి సోమవారం రాత్రి 10 గంటల 15 సెకన్లకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ60 (పీఎస్‌ఎల్‌వీ) నింగిలోకి దూసుకెళ్లగా.. ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ బయలుదేరిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్-1బి, 15.12 నిమిషాలకు స్పేడెక్స్-1ఎ రాకెట్ నుంచి విడిపోయాయి.
ఆర్యభట్ట నుంచి ఇప్పటివరకు ఇస్రో చేపట్టిన ప్రధానమైన ప్రయోగాల్లో స్పేడెక్స్ కూడా ఒకటి. పీఎస్‌ఎల్‌వీ 420 కిలోల బరువుగల స్పేడెక్స్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జంట ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టింది. కక్ష్యలో విడివిడిగా తిరుగుతున్న ఈ ఉపగ్రహాలను కొద్దిరోజుల తర్వాత సంక్లిష్ట విన్యాసంతో ఇస్రో శాస్త్రవేత్తలు అనుసంధానం (డాకింగ్) చేయనున్నారు. ఈ రెండు చిన్న ఉపగ్రహాలను ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించడమే ఈ మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది ఇస్రో. అది విజయవంతమైతే.. ఇప్పటికే డాకింగ్ సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ సగర్వంగా నిలుస్తుంది.
చందమామపైకి భారత వ్యోమగాములను పంపి, అక్కడి మట్టి ఇక్కడికి తీసుకురావాలన్నా, సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించుకోవాలన్నా.. ఇలా భవిష్యత్తులో చేపట్టబోయే పలు కీలక ప్రయోగాలకు అత్యంత కీలకమైనది డాకింగ్ పరిజ్ఞానం. ప్రస్తుతానికి అమెరికా, రష్యా, చైనా అంతరిక్ష పరిశోధనల సంస్థల వద్ద మాత్రమే ఈ పరిజ్ఞానం ఉంది.
పీఎస్‌ఎల్‌వీ-సీ60 ప్రయోగం విషయానికి వస్తే.. పీఎస్4-ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంట్ మాడ్యూల్ ఉంది. దీనిని పీవోఈఎంగా పేర్కొన్నారు. పీఎస్‌ఎల్‌వీ వాహక నౌక ప్రయోగం అనంతరం పీఎస్4 (నాలుగో దశ)లో కొన్ని పరిశోధనలు చేపట్టనున్నారు. మూడు నెలల వరకు కక్ష్యలో మైక్రోగ్రావిటీ ప్రయోగాలను నిర్వహించడానికి శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించనున్నారు. పీవోఈఎం (పోయమ్)-4లో మొత్తం 24 పేలోడ్‌లను కక్ష్యలోకి పంపనున్నారు. వీటిలో 14 పేలోడ్‌లు ఇస్రోకు చెందినవి కాగా, మరో 10 పేలోడ్‌లు స్టార్టప్‌లతో కూడిన వివిధ ప్రభుత్వేతర సంస్థలకు చెందినవి.
ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఎస్‌డీఎక్స్01(చేజర్), ఎస్‌డీఎక్స్02(టార్గెట్) అనే రెండు చిన్న ఉపగ్రహాల్లో ఒక్కో ఉపగ్రహం 220 కిలోల బరువు ఉంది. ఐదు కిలోమీటర్ల దూరం ఉండేలా వీటిని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు భూమికి 470 కిలోమీటర్ల ఎత్తులో ఈ రెండింటినీ 3 మీటర్ల సమీపానికి చేర్చి డాకింగ్ ప్రక్రియను పూర్తి చేస్తారు.
ఇస్రోకు ఇది 99వ ప్రయోగం.పీఎస్‌ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చీఫ్ సోమనాథ్ ప్రకటించారు. ఉపగ్రహాలను వాహకనౌక నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని తెలిపారు. డాకింగ్ ప్రక్రియకు మరో వారం రోజులు పడుతుందని చెప్పారు. ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.