Chalakudy, February 05: ఒక్కసారి ఊహించుకోండి మన ఇళ్లల్లో ఉండే నల్లాల్లోకి నీళ్లకు బదులు బ్రాందీ, విస్కీ, రమ్, బీర్ లాంటివి వస్తే ఎలా ఉంటుంది? మద్యం అంటే ఇష్టపడని వారికి 'ఛీ, యాక్' అని అనిపిస్తుందేమో గానీ, మందుబాబులకు మాత్రం ఆహా.. అమృతం, మహా తీర్థం అని పండగ చేసుకుంటారు. కానీ ఇలా ఎప్పుడైనా, ఎక్కడైనా జరుగుతుందా అనుకుంటే మీరు మద్యంలో కాలేసినట్లే. ఎందుకంటే ఇది జరిగింది, ఎక్కడో
కేరళ రాష్ట్రంలో
వివరాల్లోకి వెళ్తే, కేరళలోని (Kerala) త్రిశూర్ (Thrissur) జిల్లాలో గల చలకుడీ (Chalakudy) పట్టణంలో నివాసం ఉండే ఒక అపార్ట్‌మెంట్ వాసులు ఓ వింత పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆ అపార్ట్‌మెంట్‌లోని కులాయిల్లో వచ్చే నీరు కల్తీ జరిగినట్లు అందులోని నివాసితులు అనుభూతి చెందారు. ఆ నీరు ఒక రకమైన రంగు కలిగి, వాసన కూడా కొంచెం తేడాగా, ఎదో మద్యం వాసన (Liquor) లాగా మత్తుగా అనిపించింది.
దీంతో అందరూ కలిసి ఆ అపార్ట్‌మెంట్ యజమానికి ఫిర్యాదు చేయడంతో ఆయన దీనికి కారణం ఏంటో తెలుసుకునే పనిలో పడ్డాడు. ఆ అపార్ట్‌మెంట్ మొత్తానికి దగ్గర్లోని ఒక బావి ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. అక్కడకు వెళ్లి ఆ బావిలో వాసన చూడగా, అక్కడా అదే వాసన. అర్థమైపోయింది! బావిలోనే ఏదో కల్తీ జరిగిందని నిర్ధారించుకొని స్థానిక మున్సిపాలిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఇక అందుకు కారణం కూడా అధికారుల నిర్లక్ష్యమనే తేలింది. ఆ బావికి దగ్గర్లోనే ఒక మద్య షాపు- బార్ ఉంది. ఆ బార్ యజమానికి - ఎక్సైజ్ అధికారులకు మధ్య ఇటీవల వివాదం చోటు చేసుకుంది. ఎక్సైజ్ అధికారులు ఆ బార్ లోని మద్యాన్ని సీజ్ చేస్తూ సుమారు 4500 బాటిళ్ల మద్యాన్ని అపార్ట్‌మెంటుకి నీటి సరఫరా అయ్యే బావికి దగ్గర్లో గుంత చేసి అందులో పూడ్చి పెట్టారు. దీంతో ఆ మద్యం అంతా బావిలో మంచిగా కలిసింది. అదే మద్యం- నీళ్లు అపార్ట్ మెంటు వాసులకు సరఫరా అయింది. మద్యం కోసం తహతహలాడి రూ. 51 వేలు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్ మహిళ
అపార్ట్‌మెంట్ కులాయిల్లో మద్యం సరఫరా (Liquor flows in water taps) అవుతుందని తెలియడంతో స్థానికులు ఆశ్చరం వ్యక్తం చేయగా, మందుబాబులు ఆనందం వ్యక్తం చేశారు. 'ధర్మ ప్రభువులు మా ప్రభుత్వం, ఇంటింటికే మద్యం పథకం' పెట్టిందనుకోని ఫీలయ్యారు. అయితే వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు.
మున్సిపల్ అధికారులు ఆ బావి ద్వారా నీటి సరఫరా నిలిపివేశారు. "బావిని ఇప్పటికే 8 సార్లు శుభ్రం చేశాం, ప్రభావిత నివాసితులకు తాగునీరు, ఇతర అవసరాలకు ప్రత్యేకంగా నీటిని సరఫరా చేస్తున్నాం, బావి నుంచి స్వచ్ఛమైన నీరు వచ్చేవరకు, ఈ సహాయం కొనసాగిస్తాం" అని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు.