New Delhi, March 3: దేశంలో సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ సహా మిగతా అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ ను ఈ ఆదివారం వదిలేద్దామనుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. దీంతో లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ కలిగి ప్రధాని ఎందుకిలా చేస్తున్నారబ్బా అనే సందేహాలు అందరూ వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అయితే సోషల్ మీడియాను కాదు, మతపరమైన ధ్వేషాన్ని వదులుకోండి అంటూ తనదైన శైలిలో విమర్శలు చేశారు. అయితే మోదీ చేసిన ఆ ట్వీట్ కి అర్థం- అంతరార్థం వేరే ఉంది. ఆయన నిజానికి సోషల్ మీడియా నుంచి వైదొలగడం లేదు. కానీ, ఆ ఒక్కరోజు తన సోషల్ మీడియా అకౌంట్లను మహిళలకు ఇచ్చేస్తున్నట్లు ఆయన తాజాగా చేసిన మరో ట్వీట్ ద్వారా స్పష్టం అయింది.
ఈ ఆదివారం 'మహిళా దినోత్సవం' జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా సమాజంలో స్పూర్థిధాయకంగా నిలిచే మహిళలందరికీ తన సోషల్ మీడియాను ఆ ఒక్కరోజు అంకితమిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. "అలాంటి మహిళలు మీరైతే, లేదా నలుగురికి స్పూర్థిగా నిలిచే మహిళ మీకు తెలిస్తే, తన సోషల్ మీడియా ద్వారా మీ స్పూర్థిధాయకమైన కథను పంచుకోండి" అంటూ ప్రధాని మోదీ ఆఫర్ ఇచ్చారు. అలా పంచుకోవడం ద్వారా ఆ కథ ఎంతో మందికి చేరి, మరెంతో మంది మహిళల్లో స్పూర్థిని నింపుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
మోదీ ఆలోచన ప్రకారం, మార్చి 08, 2020 మహిళా దినోత్సవం రోజున, నేరుగా ప్రధానికి సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచే #SheInspiresUs అనే హ్యాష్‌ట్యాగ్‌ను శక్తివంతమైన మహిళల కథలను పంచుకోవచ్చు.
Here is the PM's tweet:
This Women's Day, I will give away my social media accounts to women whose life & work inspire us. This will help them ignite motivation in millions.
Are you such a woman or do you know such inspiring women? Share such stories using #SheInspiresUs. pic.twitter.com/CnuvmFAKEu
— Narendra Modi (@narendramodi) March 3, 2020
లేదా స్వయంగా వారే తమ ఆదర్శవంతమైన ప్రయాణాన్ని , తమ జీవితంలో కష్టనష్టాల కోర్చి సాధించిన విజయాలను నరేంద్ర మోదీ పేజీ ద్వారా స్వయంగా పోస్ట్ చేయవచ్చు. అయితే అందుకు తమ కథను తెలుపుతూ ముందుగానే ఎంట్రీలు పంపాల్సి ఉంటుంది. ప్రధాని కార్యాలయం అధికారులు ఎంపిక చేసిన కొందరికి అవకాశం కల్పిస్తారు.