తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ పండుగ భోగి మంటలతో, భోగి పళ్లతో మొదలవుతుంది. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరి లోగిల్లో రంగు రంగుల ముగ్గులు, వాటి మధ్య గొబ్బెమ్మలు.. బోగి మంటలతో పండుగ శోభను సంతరించుకుంటాయి. వీటితో పాటు హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోడి పందేలు, కొత్త అల్లుళ్ల హడావుడి వంటి విశేషాలతో సంక్రాతి కాస్త సరదాగా మారిపోతుంది. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి పండుగగా జరుపుకుంటారు.

ఈ సందర్భంగా భోగి పండుగ రోజున మంటలెందుకేస్తారు.. చిన్నారులపై భోగి పళ్లను ఎందుకు పోస్తారనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం... హిందూ పురాణాల ప్రకారం, సూర్యుడి దక్షిణ యానానికి చివరి రోజుగా భావిస్తారు. దీని కంటే మందు ప్రతి ఒక్కరూ తాము ఎదుర్కొన్న కష్టనష్టాలు, బాధలన్నీ మంటల రూపంలో పూర్తిగా తొలగిపోవాలని అగ్ని దేవుడిని కోరుకుంటారు. ఈ నేపథ్యంలోనే భగ అనే పదం నుండి భోగి వచ్చిందంటారు.రాబోయే ఉత్తరయాన కాలంలో తమ సంపద, ఆరోగ్యం, శ్రయేస్సు పెరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

సంక్రాంతి పండుగ విశిష్టత

ఈ సమయంలో పంట మంచి దిగుబడి సాధించిన రైతుల ఇళ్లల్లో ధన, ధాన్యలక్ష్మిలు కొలువై ఉంటారు కనుక వారు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో నాలుగురోజుల పాటు జరుపుకునే ఈ పండుగను.. తెలంగాణలో మాత్రం మూడు రోజుల పాటు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని నాలుగు రోజుల పాటు ఈ పండుగ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.

మకర సంక్రాంతి వేళ తప్పకుండా చేయవలసిన పనులు ఇవే, ఈ పనులు చేయక పోతే చాలా నష్టపోతారు..

భోగి పండుగ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి గ్రామాల్లోని వీధులలో, కూడళ్లలో భోగి మంటలు వేస్తారు. వీటితో పాటు ఈ పవిత్రమైన రోజున తమకు భోగభాగ్యాలు కలగాలని పిల్లలపై భోగిపళ్లు, పొంగలి తయారీ వంటివి రెడీ చేస్తారు. ఇదే కాదు.. మహా శివరాత్రికి ముందురోజున శివ భోగి అంటారు. నరక చతుర్దశి రోజు దీపావళి భోగి అంటారు. నవరాత్రుల వేళ దసరా భోగి అంటారు. దీంతో ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది.

పురాణాల ప్రకారం..

రేగుపళ్లను ఇండియన్ డేట్, ఇండియన్ జుజుబీ అని పిలుస్తారు. రేగుపళ్ల ప్రస్తావన పురాణాలలో ఉంది. నారాయణులు బదరీ వృక్షంగా పిలువబడే రేగు చెట్టు దగ్గరే ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారని.. అందుకే ఆ ప్రాంతానికి బదరీక్షేత్రం అని పేరు వచ్చిందని ప్రతీతి. భారతీయ వాతావరణంలో.. ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుని రేగుచెట్టు పెరుగుతుందట. అలాగే సంక్రాతి సమయానికి రేగుపళ్లు అందుబాటులోకి వస్తాయి. పులుపు, తీపి రుచి కలిగిన ఇవి.. అమోఘమైన రుచినే కాదు.. ఆరోగ్యానికి మంచిదే. అందుకే పిల్లల తలపై భోగిపళ్లు పోసే సంప్రదాయానికి రేగుపళ్లనే ఎంచుకున్నారు.

భోగి మంటల పరమార్థం

ఈ మంటల ద్వారా చలిని పారద్రోలటమేగాకుండా.. ఆరోజు నుంచి జీవితాన్ని కొత్తవాటితో ప్రారంభించాలని అర్థం చేసుకోవాలి. అలాగే మనసులో పేరుకుపోయిన చెడును కూడా విడిచిపెట్టాలని, అందులోని ఏకీకరణ భావాన్ని కూడా వారు అర్థం చేసుకోమని సూచిస్తుంటారు. ఇక భోగి రోజు సాయంత్రంపూట అందరి ఇళ్లలోనూ ఏర్పాటుచేసే బొమ్మల కొలువంటే పిల్లలకు భలే సరదా. ఈ బొమ్మల కొలువుల్లో పిల్లలు వారి దగ్గర ఉండే అన్నిరకాల ఆట వస్తువులను ఉంచి సంతోషిస్తారు. అలాగే ఈ సందర్భంగా తల్లులు పేరంటాన్ని ఏర్పాటు చేసి ఇరుగుపొరుగు మహిళలకు పసుపు కుంకుమలు అందిస్తారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)