భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇటీవ‌లే అల్లర్లు చెల‌రేగిన కోన‌సీమ జిల్లా కేంద్రం అమ‌లాపురం ప‌ర్యట‌న‌కు బ‌య‌ల్దేరిన సోము వీర్రాజును తూర్పు గోదావ‌రి జిల్లా జొన్నాడ స‌మీపంలో పోలీసులు అడ్డుకున్నారు. సోము వీర్రాజు కారు ముందు ఓ భారీ వాహనాన్ని ఉంచారు.

దీంతో పోలీసుల తీరుపై వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ‌లాపురం అల్లర్లలో గాయ‌ప‌డ్డ బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళుతున్న త‌నను అడ్డుకోవ‌డ‌మేమిట‌ని వీర్రాజు ప్రశ్నించారు. అల్లర్ల నేప‌థ్యంలో ఇంకా పోలీసు ఆంక్షలు కొన‌సాగుతున్న అమ‌లాపురంలో ప్రముఖుల ప‌ర్యట‌న‌కు అనుమ‌తించ‌లేమ‌ని పోలీసులు ఆయ‌న‌కు తేల్చిచెప్పారు. అయితే, తన కారును అడ్డుకోవడంపై సోము వీర్రాజు ఫైరయ్యారు.

అడ్డొచ్చిన ఎస్సైని తోసేసిన సోము వీర్రాజు.. తనను అడ్డుకోవడానికి మీరెవరు అంటూ విరుచుకుపడ్డారు. కావాలనే తనను ఆపుతున్నారని చెప్పారు. తాను జిల్లా ఎస్పీతో మాట్లాడానని తన కారును వదలాలన్నారు. అలాగే, తన కారు ముందు అడ్డుపెట్టిన భారీ వాహనం డ్రైవర్‌పై ఫైరయ్యారు. ‘నువ్వు ఎవడ్రా నన్ను ఆపడానికి.. ఇడియట్.. ముందు బండిని అడ్డుతియ్..’ అంటూ వాహన డ్రైవర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మర్యాద లేదా మీకు అంటూ దుయ్యబట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. రావుల‌పాలెంలోని త‌మ పార్టీ నాయకుడి త‌ల్లి ఇటీవ‌లే మ‌ర‌ణించార‌ని.. క‌నీసం ఆ నేత కుటుంబం ప‌రామ‌ర్శకైనా అనుమ‌తించాలని వీర్రాజు కోరారు. దీంతో రావుల‌పాలెం వ‌ర‌కు అయితే అనుమతిస్తామని పోలీసులు చెప్పడంతో ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)