కెనడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన ఐదుగురు యువకులు మృత్యువాతపడగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ విషయాన్నిభారత హైకమిషనర్ అజయ్ బిసారియా సోమవారం ట్విట్టర్‌ వేదికగా ధృవీకరించారు. కెనడాలోని ఒంటారియోలో శనివారం ఉదయం హైవే-401పై ప్యాసింజర్‌ వ్యాన్‌లో భారత్‌కు చెందిన విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో ఓ ట్రాక్టర్‌.. వారు ప్రయాణిస్తున్న వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కాగా, మరణించిన విద్యార్థులను హర్‌ప్రీత్ సింగ్, జస్పిందర్ సింగ్, కరణ్‌పాల్ సింగ్, మోహిత్ చౌహాన్, పవన్ కుమార్‌లుగా గుర్తించారు.

ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా వెల్లడిస్తూ.. అజయ్‌ బిసారియా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విద్యార్థుల మృతిపై తాజాగా భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌, జైశంకర్‌ స్పందిస్తూ.. చనిపోయిన విద్యార్థులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. వారికి భారత ప‍్రభుత్వం నుంచి మద్దతు, సహాయ సహకారాలు అందించనున్నట్టు ట‍్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)