CSK vs SRH Highlights: తిరుగులేని చెన్నై సూపర్ కింగ్స్, 7 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై సునాయాస విజయం, పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానం; నేడు ముంబై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్
Ruturaj Gaikwad | CSK Vs SRH Highlights | Photo: VIVO IPL 2021

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఆల్ టైమ్ ఫేవరెట్ జట్టు మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది సీజన్ లో కూడా తన సత్తా చాటుతూ వస్తోంది. 14వ ఎడిషన్ ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఓడిపోయిన సీఎస్‌కె తిరిగి తన స్టైల్‌లో బౌన్స్ అయ్యింది. బుధవారం దిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై సునాయాస విజయం నమోదు చేసింది. వరుసగా 5వ విజయం తన ఖాతాలో వేసుకున్న సీఎస్‌కె 'టాప్' గేర్ లో దూసుకుపోతుంది.

మ్యాచ్‌ వివరాల్లోకి వెళ్తే, టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. SRH ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే బెయిర్ స్టో 7 పరుగులే చేసి విఫలమైనా, డేవిడ్ వార్నర్ 57 పరుగులు ఆ తర్వాత వచ్చిన మనీష్ పాండే 61 పరుగులతో రాణించారు. హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 171 పరుగులు చేసింది.

ఇక 172 పరుగుల విజయలక్ష్యంతో రన్ ఛేజ్ ప్రారంభించిన సీఎస్‌కేకు ఒపెనర్లు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ఫాఫ్ డు ప్లెసిస్ 38 బంతుల్లో 56 పరుగులు చేయగా, రుతురాజ్ గైక్వాడ్ 44 బంతుల్లో 75 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు 12 ఓవర్లలోనే 129 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. మెల్లిగా స్పీడ్ పెంచుతున్న గైక్వాడ్ ను SRH స్పిన్నర్ రషీద్ ఖాన్ మంచి గూగ్లీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన మోయిన్ అలీ కూడా 15 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లోనే క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. ఆ వెంటనే డుప్లెసిస్ ను రషీద్ ఖాన్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. అప్పటికి చెన్నై స్కోర్ 15 ఓవర్లకు 148/3. అయితే సురేష్ రైనా, రవీంద్ర జడేజా కలిసి సీఎస్‌కే గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశారు. 18.3 ఓవర్లలోనే CSK 173 స్కోర్ చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' గా ఎంపికయ్యాడు.

ఇక ఆడిన 6 మ్యాచుల్లో ఈ ఓటమితో కలిపి మొత్తం 5 ఓటములు చవిచూసిన సన్ రైజర్స్ హైదరాబాద్‌ ఐపిఎల్-2021 పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.ఇక ముందు ఎలాంటి అద్భుతాలు జరిగినా సన్ రైజర్స్ నాకౌట్ దశలోకి వెళ్లేలా కనిపించడం లేదు.

ఈరోజు దిల్లీలోని ఇదే స్టేడియంలో ముంబై మరియు రాజస్థాన్ తలపడనున్నాయి.