IPL Trophy (Photo Credits: Twitter/IPL)

ఐపీఎల్‌ 2021లో భాగంగా గురువారం జరిగిన రెండో మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై దిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దిల్లీ క్యాపిటల్స్ ఒపెనర్ పృథ్వీ షా 'వన్ మ్యాన్ షో'' చూపించాడు. ఆడిన తొలి ఓవర్లోనే 6 ఫోర్లు కొట్టి వాహ్ అనిపించాడు. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే.. టాస్ గెలిచిన దిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకొంది. దీంతో బ్యాటింగ్ కు వచ్చిన కోల్‌కతా నైట్ రైడర్స్‌ బ్యాట్స్ మెన్ ఎప్పట్లాగే తమ నిలకడలేమిని ప్రదర్శించారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ అంతా తక్కువ స్కోర్లకే ఔట్ అవుతూ భారం అంతా 6వ వికెట్ నుంచి వచ్చే రస్సెల్స్, దినేష్ కార్తీక్, మరియు కమిన్స్ పైనే ఉంచుతున్నారు. కాగా, ఈ మ్యాచ్ లో కూడా 12 ఓవర్లకే 5 వికెట్లు కోల్పోయి 85 పరుగుల వద్ద కష్టాల్లో ఉన్న జట్టును ఆండ్రూ రస్సెల్స్ ఆదుకున్నాడు. 27 బంతుల్లోనే 4 సిక్సులు, 2 ఫోర్లతో 45 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేయగలిగింది.

ఇక 155 పరుగుల స్వల్ప లక్ష్యంతో రన్ ఛేజ్ ప్రారంభించిన దిల్లీ క్యాపిటల్స్ కు దాదాపు ఒపెనర్లే విజయం ఖాయం చేశారు. తొలి ఓవర్ నుంచే రెచ్చిపోయిన పృథ్వీ షా 200 స్ట్రైక్ రేట్ తో 41 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 సిక్సులతో 82 పరుగులు చేశాడు. మరో ఒపెనర్ శిఖర్ ధవన్ కూడా వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ 46 పరుగులు చేశాడు. వీరిద్దరి జోడి దిల్లీ క్యాపిటల్స్ కు తొలి వికెట్ కు 13 ఓవర్లలోనే 132 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. ఒపెనర్లు ఇద్దరే మ్యాచ్ ఫినిష్ చేస్తారేమో అనుకుంటుండగా, కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ దిల్లీ కాపిటల్స్ తొలి 3 వికెట్లను పడగొట్టాడు. అయినప్పటికీ దిల్లీ క్యాపిటల్స్ 16.3 ఓవర్లలోనే 156 పరుగులు చేసి మరో విజయం నమోదు చేసింది. పృథ్వీ షా 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' గా ఎంపికయ్యాడు.

ఈ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు ఏ జట్టు ఏ స్థానంలో ఉందో కింద పట్టికలో చూడండి.

IPL 2021 Points Table as on 29 April 2021 | Photo: VIVO IPL 2021

శుక్రవారం, అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. రాత్రి 7:30 నుంచి మ్యాచ్ ప్రారంభం అవుతుంది.ఇక, అంతకుముందు ముంబై మరియు రాజస్థాన్ మధ్య మ్యాచ్ లో ముంబై జట్టు తన ఫాంను కొనసాగించింది. 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ పై మరో సునాయాస విజయాన్ని నమోదు చేసింది. టాస్ ఓడిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేయగా, అందుకు జవాబుగా ముంబై జట్టు 18.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ముంబై జట్టు నుంచి 70 పరుగులు చేసిన క్వింటన్ డికాక్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' గా ఎంపికయ్యాడు.