Australia Beat England in Record Run Chase

Lahore, FEB 22: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లిష్ జట్టు 8 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. టోర్నీ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కాగా.. ఈ కొండంత లక్ష్యాన్ని కంగారులు 5 వికెట్లు కోల్పోయి 15 బంతులు మిగిలుండగానే ఛేదించారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జోష్‌ ఇంగ్లిస్ (Josh Inglis) (120*; 86 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతక్కొట్టాడు. అలెక్స్ కేరీ (69), మాథ్యూ షార్ట్ (63) అర్ధ శతకాలు బాదారు. లబుషేన్ (47) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

Alex Carey Stunning Catch: వీడియో ఇదిగో.. కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన అలెక్స్ క్యారీ.. ఒంటి చెత్తో గాలిలో అద్భుత క్యాచ్.. వావ్ అనకుండ ఉండలేరు 

ట్రావిస్ హెడ్ (6), స్టీవ్ స్మిత్ (5) విఫలమవడంతో ఆసీస్‌ 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో షార్ట్, లబుషేన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరగా.. ఇంగ్లిస్‌, కేరీ బాధ్యత తీసుకుని జట్టును విజయం దిశగా నడిపించారు. ముఖ్యంగా జోష్‌ ఇంగ్లిస్ మంచి షాట్లు ఆడుతూ ఆస్ట్రేలియా జట్టులో జోష్‌ నింపి చరిత్రాత్మక విజయం అందించాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (32*; 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు.

Australia  Beat England By Five Wickets

 

తొలుత ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ బెన్ డకెట్ (165; 143 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ శతకంతో విరుచుకుపడ్డాడు. జో రూట్ (68; 78 బంతుల్లో 4 ఫోర్లు) రాణించాడు. ఫిల్ సాల్ట్ (10), జేమీ స్మిత్ (15) త్వరగానే పెవిలియన్‌ చేరడంతో ఇంగ్లాండ్ 43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రూట్‌తో కలిసి డకెట్‌ (Ben Duckett) ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ జోడీ మూడో వికెట్‌కు 158 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. 95 బంతుల్లో శతకం బాదిన డకెట్.. మరో 39 బంతుల్లో 150 పరుగుల మార్కు అందుకున్నాడు. జోస్ బట్లర్ (23), లివింగ్‌స్టన్ (14) పరుగులు చేయగా.. హ్యారీ బ్రూక్ (3) నిరాశపర్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో డ్వారిషూస్‌ 3, ఆడమ్ జంపా 2, లబుషేన్ 2, మ్యాక్స్‌వెల్ ఒక వికెట్ పడగొట్టారు.