Southampton: సౌథాంప్టన్ లోని హాంప్‌షైర్ బౌల్ వేదికగా భారత్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా దాదాపు రెండున్నర రోజులు ఆట జరగలేదు, బుధవారం 'రిజర్వ్ డే' రోజున ఆట చివరి రోజు కివీస్ నుంచి బలమైన ప్రదర్శన కనిపించింది. వారి బౌలర్లు భారత బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీయడంతో, రెండో ఇన్నింగ్స్ లో భారత్ కేవలం 170 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుంటే లక్ష్యం 139కే తగ్గింది. దీంతో స్వల్ప లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆరంభించిన న్యూజిలాండ్ జట్టు సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించి టెస్ట్ క్రికెట్లో విశ్వ విజేతగా నిలిచింది.
ఇక తొలి ఇన్నింగ్స్ లో 217 పరుగులు చేసిన భారత్, రెండో ఇన్నింగ్స్ లో కనీసం 2 సెషన్లు ఆడి, మరో 30-40 పరుగులు అదనంగా జోడించి ఉంటే ప్రత్యర్థి విజయ లక్ష్యం పెరిగి, మ్యాచ్ కనీసం డ్రా చేసుకొని రెండు జట్లు సంయుక్త విజేతలుగా నిలిచేవి. అయితే ఓవర్ నైట్ స్కోర్ 64/2 వద్ద రోజు చివరి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది - కెప్టెన్ విరాట్ కోహ్లీ (13), చేతేశ్వర్ పుజారా (15), మరియు అజింక్య రహానె (15) కోల్పోయి మొదటి సెషన్లో 130 / 5 స్కోరు చేసింది. ఆ తర్వాత రిషభ్ పంత్ ఒక్కడే 41 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. రిషభ్ ఔట్ ఏడో వికెట్ రూపంలో ఔట్ అయిన తర్వాత మిగతా భారత బ్యాట్స్ మెన్ కూడా వెంటనే పెవిలియన్ చేరడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ లో 170 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఇక 139 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (52 నాటౌట్), రాస్ టేలర్ (47 నాటౌట్) మధ్య 96 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం ద్వారా సాధించి ప్రపంచ కప్ ను తమ సొంతం చేసుకున్నారు. న్యూజిలాండ్ జట్టు 2015 మరియు 2019 సంవత్సరాల్లో రెండు పర్యాయాలు ప్రపంచ కప్ ఫైనల్‌లో ఓడిపోయి ఎట్టకేలకు ఇప్పుడు టెస్ట్ ప్రపంచ కప్ గెలవడం ఆ జట్టుకు ఒక గొప్ప రిలీఫ్ అని చెప్పవచ్చు.
ఫైనల్ మ్యాచ్ స్కోర్ల వివరాలు:
భారత్ తొలి ఇన్నింగ్స్ 217; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 249
భారత్ రెండో ఇన్నింగ్స్ 170; న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ 140/2
చివరి రోజు కోటాలో ఇంకా 6 ఓవర్లు మాత్రమే మిగిలి ఉండగా, న్యూజిలాండ్ నిర్ధేషిత లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లు తీసి భారత విజయావకాశాలను దెబ్బతీసిన కివీస్ పేసర్ కైల్ జేమిసన్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' గా నిలిచాడు