New Delhi, DEC 21: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja)కు ఐసీసీ ఊహించని షాకిచ్చింది. అంతర్జాతీయ మ్యాచుల్లో ఐసీసీ నియమాల(ICC Rules)కు విరుద్ధంగా వ్యవహరించాడనే కారణంతో ఈ ఓపెనర్‌పై చర్యలకు ఉపక్రమించింది. పెర్త్‌లో పాకిస్థాన్(Pakistan)తో జరిగిన తొలి టెస్టులో ఈ ఆసీస్ ఓపెనర్ భుజానికి నల్ల రిబ్బన్(Black Ribbon) ధరించి బ్యాటింగ్ చేశాడు. పాలస్థీనాకు మద్దతుగా తాను అలా చేశానని ఖవాజా చెప్పాడు. అయితే.. క్రికెట్ ఆస్ట్రేలియా, ఐసీసీ అనుమతి తీసుకోకుండా ఖవాజా నల్ల రిబ్బన్ ధరించడాన్ని ఐసీసీ తప్పుబట్టింది.
‘ఐసీసీ ప్లేయింగ్ కండీషన్స్ పేజీలో రాసున్న క్రికెటర్ల దుస్తులు, వస్తువుల నియంత్రణకు సంబంధించిన క్లాజ్ ‘ఎఫ్’ను ఖవాజా ఉల్లంఘించాడు. అతడిపై ఏం చర్యలు ఉంటాయనేది అందులోనే రెండో భాగంలో ఉంది. ఖవాజా తొలి టెస్టులో బ్లాక్ రిబ్బన్ ద్వారా వ్యక్తిగత మెసేజ్‌ను ప్రదర్శించాడు. అయితే.. అతడు తన తప్పును అంగీకరించి.. మరోసారి అలా చేయనని చెప్పాడు’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఐసీసీ నియమ నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా ఆటగాళ్లు ఏదైనా మెసేజ్‌నుజెర్సీలు, బ్యాటుపై లేదా షూ, రిబ్బన్ బ్యాండ్‌ల ద్వారా ప్రదర్శించడం నేరం. ఈ నియమాల్ని అతిక్రమిస్తే ఐసీసీ చర్యలు తీసుకుంటుంది. ఖవాజా ఈ మధ్య పలు సందర్భాల్లో తన షూ మీద.. ‘ఫ్రీడం అనేది మానవుల హక్కు’, ‘అందరి జీవితాలు సమానమే’ వంటి మెసేజ్‌లతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. స్వదేశంలో పాక్‌తో జరిగిన తొలి టెస్టులో ఖవాజా తొలి ఇన్నింగ్స్‌లో 41, రెండో ఇన్నింగ్స్‌లో 90 పరుగులతో అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 360 పరుగుల భారీ తేడాతో గెలుపొంది 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.