Machilipatnam Port Works Inauguration: బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించిన సీఎం జగన్, నెరవేరిన మచిలీపట్నం ప్రజల చిరకాల వాంఛ

మచిలీపట్నం(బందరు) ప్రజల చిరకాల కల ఎట్టకేలకు సాకారం అయ్యింది. సీఎం వైఎస్‌ జగన్‌ బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించారు. తపసిపూడి తీరంలో బ్రేక్‌ వాటర్‌ పనులు ప్రారంభించారు.

Machilipatnam Port Works Inauguration: బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించిన సీఎం జగన్, నెరవేరిన మచిలీపట్నం ప్రజల చిరకాల వాంఛ
Machilipatnam Port Works Inauguration (Photo-Video Grab)

Machilipatnam, May 22: మచిలీపట్నం(బందరు) ప్రజల చిరకాల కల ఎట్టకేలకు సాకారం అయ్యింది. సీఎం వైఎస్‌ జగన్‌ బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించారు. తపసిపూడి తీరంలో బ్రేక్‌ వాటర్‌ పనులు ప్రారంభించారు. 35.12 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో రెండు జనరల్‌ కార్గోకు, ఒకటి బొగ్గుకు, మరొకటి మల్టీపర్పస్‌–కంటైనర్‌తో ఎగుమతి, దిగుమతులకు ఉపయోగపడేలా మొత్తం నాలుగు బెర్తులతో మచిలీపట్నం పోర్టును 24–30 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ పోర్టు పనుల పూర్తితో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి లభించనుంది. వాణిజ్య కార్యకలాపాలు విస్తరించేకొద్దీ 16 బెర్తులతో 116 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును విస్తరించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు.ఇక ఈ పోర్టు ద్వారా రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, అదిలాబాద్, నల్గొండ, వరంగల్‌ జిల్లాలకు ఎరువులు, బొగ్గు, వంటనూనె, కంటైనర్ల దిగుమతులు, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, సిమెంట్‌ క్లింకర్, గ్రానైట్, ముడి ఇనుము ఎగుమతులకు వేదికగా మారనుంది. సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్‌వే, మూలపేట పోర్టుల నిర్మాణాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 75 వేల మందికి ఉపాధి లభించనుంది.

వైఎస్ వివేకా హత్య కేసు, అరెస్ట్ సంకేతాలు, ముందస్తు బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి

తూర్పు తీరంలో ఆంగ్లేయులతో పాటు డచ్, పోర్చుగీస్‌ వారికి సైతం వ్యాపార కేంద్రంగా మచిలీపట్నం పోర్టు విలసిల్లింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే పోర్టు నిర్మాణానికి 2020 ఫిబ్రవరి 4న మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పేరుతో ప్రత్యేక సంస్థ ఏర్పాటు.. రూ.5,156 కోట్లతో పోర్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న పోర్టు నిర్మాణానికి కీలకమైన పర్యావరణ అనుమతులు, ఏప్రిల్‌ 13న కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు, 2023 మార్చిలో 1,923 ఎకరాల భూసేకరణ పూర్తయిన తర్వాత మే 22న పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నారు.

ఆగ్నేయాసియాకు ముఖద్వారంగా 974 కి.మీ తీరంతో దేశంలోనే రెండో అతిపెద్ద సముద్ర తీరంగల రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఆరు పోర్టులకు అదనంగా ఏపీ మారిటైమ్‌ బోర్డు నాలుగు పోర్టులను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఉన్న విశాఖపట్నం మేజర్‌ పోర్టు, ఐదు నాన్‌ మేజర్‌ పోర్టుల ద్వారా ఏటా 320 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని రాష్ట్రం కలిగి ఉంది. అలాగే..కొత్తగా నిర్మిస్తున్న పోర్టుల ద్వారా 2025–26 నాటికి అదనంగా మరో 110 మిలియన్‌ టన్నుల రవాణా సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్య కార్యకలాపాలకు ఊతమిచ్చేలా కొత్తగా నిర్మిస్తున్న మచిలీపట్నం పోర్టు సమీపంలో పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు 4,000 ఎకరాల సాల్ట్‌ భూములను ప్రభుత్వం గుర్తించింది.తీర ప్రాంతం మరియు పోర్టు పరిసర ప్రాంతాల పారిశ్రామికీకరణ దిశగా అడుగులు వేయడంతో పాటు పోర్టు అనుసంధానిత లాజిస్టిక్స్‌ ఏర్పాటు ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశం లభించనుంది.

ప్రతీ 50 కి.మీకు ఒక పోర్టు లేదా ఫిషింగ్‌ హార్బరు ఉండేలా మత్స్యకారులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో 10 ఫిషింగ్‌ హార్బర్లు, ఆరు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. వీటిద్వారా 2035 నాటికి రాష్ట్ర సముద్ర వాణిజ్య విలువ 20 బిలియన్‌ డాలర్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇక రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అతిపెద్ద సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో దేశంలోని అతిపెద్ద పోర్టుల్లో ఒకటిగా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలకంగా మార్చే విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేయనున్నారు.

మచిలీపట్నం పోర్టు విశేషాలు..

► భూసేకరణ, ఇతర అనుబంధ పోర్టులతో కలిపి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.5,155.73 కోట్లు

► వార్షిక సామర్థ్యం 35.12 మిలియన్‌ టన్నులు

► బెర్తుల సంఖ్య 4

► భూసేకరణ.. 1,923 ఎకరాలు

► ఎన్‌హెచ్‌ 216ను అనుసంధానం చేస్తూ 6.5 కి.మీ. మేర నాలుగు లేన్ల రహదారి

► పెడన రైల్వేస్టేషన్‌ నుంచి పోర్టు వరకు 7.5 కి.మీ రైల్వే లైన్‌ నిర్మాణం

► బందరు కెనాల్‌ నుండి 11 కి.మీ పైప్‌లైన్‌ ద్వారా 0.5 ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్స్‌ పర్‌ డే) నీటి సరఫరా

► పెడన 220 కేవీ సబ్‌స్టేషన్‌ నుండి 15 ఎంవీఏ (మెగా వోల్ట్‌ యాంప్‌) విద్యుత్‌ సరఫరా

(The above story first appeared on LatestLY on May 22, 2023 11:25 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).