Amaravati, Feb 20: ప్రధాని మోదీ అధ్యక్షతన వర్చువల్ పద్దతిలో జరిగిన 6వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో (NITI Aayog Meeting) అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు. కాగా కోవిడ్ నేపథ్యంలో నీతి ఆయోగ్ భేటీ అత్యంత ప్రాధాన్యమైందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ( YS Jagan Mohan Reddy) మాట్లాడుతూ, కోవిడ్ కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అర్ధవంతమైన చర్చ జరగాలన్నారు. భారత్‌ను తయారీ రంగానికి కేంద్రంగా మార్చాలని కోరారు.
ఐదు రకాల అంశాలు తయారీ రంగానికి అవరోధాలుగా మారాయి. రుణాలపై అధిక వడ్డీల భారం, విద్యుత్ ఖర్చులు అధికంగా ఉండటం భూసేకరణలో ఆలస్యం వంటి అంశాలు తయారీ రంగానికి అవరోధంగా మారాయి. పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ రుణాలపై ప్రభుత్వం ఏడాదికి 10 నుంచి 11 శాతంవడ్డీ చెల్లించాల్సి వస్తోంది. తయారీ రంగంలో ముందున్న దేశాల్లో వడ్డీ రేట్లు 2 నుంచి 3 శాతం మించి ఉండటం లేదని’’ సీఎం అభిప్రాయవ్యక్తం చేశారు. పనితీరు కనబరుస్తున్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలను అందిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.
NITI Aayog Tweet
In line with the vision of the Bharat Net project, we are establishing digital public libraries & bringing the concept of Work from Home closer by providing uninterrupted access to quality internet in every village: @ysjagan, CM, #AndhraPradesh. #SixthGCM pic.twitter.com/p8DKyYuC5x
— NITI Aayog (@NITIAayog) February 20, 2021
ఈ సందర్భంగా జగన్ విజన్ కు నీతి ఆయోగ్ పాలక మండలి సంతృప్తి వ్యక్తం చేసింది. పల్లెపల్లెకు ఇంటర్నెట్ ను తీసుకెళ్లాలన్న జగన్ ఆకాంక్షను అభినందించింది. భారత్ నెట్ ప్రాజెక్టు పేరిట ప్రతిగ్రామంలో ప్రతి వ్యక్తికి ఇంటర్నెట్ అందుబాటులోకి తేవాలన్న జగన్ సంకల్పాన్ని ప్రశంసించింది. ఈ క్రమంలో ఏపీ సీఎం చేసిన వ్యాఖ్యలను నీతి ఆయోగ్ ట్వీట్ చేసింది. కాగా, నీతి ఆయోగ్ భేటీలో సీఎం జగన్ గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ అంశంపై స్పందించారు. గ్రామాల్లో ప్రజా వ్యవస్థలకే కాకుండా, ప్రతి పౌరుడికి ఇంటర్నెట్ ను అందించడమే తమ లక్ష్యమని, గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని వివరించారు. వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని ప్రజలకు అత్యంత చేరువ చేయడమే తమ ప్రాజెక్టు వెనుకున్న ఉద్దేశమని ఆయన వెల్లడించారు.
సీఎం వైఎస్ జగన్ నీతి ఆయోగ్ స్పీచ్ హైలెట్స్
►కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన డిస్ట్రిక్ బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్‌కింద 229 సంస్కరణల విషయంలో ముందుకు వెళ్తోంది
►రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది
►ప్రత్యేక హోదా ఇస్తేనే పారిశ్రామికాభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తాం
►విభజనకు ముందు ప్రత్యేక హోదా ఇస్తారని బేషరతుగా పార్లమెంటులో ప్రకటించారు
►వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఐదురకాల చర్యలను చేపట్టాల్సి ఉంటుంది
►పంటల ఉత్పత్తి ఖర్చును తగ్గించడంతోపాటు, నాణ్యమైన విత్తనాలు, సర్టిఫై చేసిన ఎరువులు, పురుగుమందులను రైతులకు అందుబాటులో తీసుకు రావాల్సి ఉంది
►పంటల స్టోరేజీ, గ్రేడింగ్, ప్రాససింగ్‌లో కొత్త టెక్నాలజీని తీసుకురావాల్సి ఉంది
►రైతులు తమ పంటలను సరైన ధరకు ఫాంగేట్‌వద్దే అమ్ముకునేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది
►రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధిద్వారా ఆదుకోవాలి
►ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు నష్టపోయిన పక్షంలో సకాలంలో వారికి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి
►రైతులకు సహాయకారిగా, అండగా ఉండేందుకు రాష్ట్రంలో 10,731 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం
►మల్టీ పర్పస్‌ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం
►సేంద్రీయ వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తున్నాం
►ప్రతి ఆర్బీకేల్లో సేంద్రీయ వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తున్నాం
►పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులో సవరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని కోరుతున్నాను
►విద్యుత్ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో సంప్రదాయేతర విద్యుత్‌ను ప్రోత్సహిస్తున్నాం
►10 వేల మెగావాట్ల సోలార్‌విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇటీవల టెండర్ ప్రక్రియను కూడా చేపట్టాం
►రాష్ట్రంలో ఉన్న సౌరశక్తిని పరిధిలోనికి తీసుకుని 30 ఏళ్ల కాలానికి యూనిట్‌కు రూ.2.48 పైసలకు యూనిట్‌విద్యుత్ రాష్ట్రానికి అందుబాటులోకి వస్తోంది
►సగటున రూ.5.2లకు యూనిట్ కరెంటును రాష్ట్రం కొనుగోలు చేస్తోంది
►రివర్స్ పంపింగ్ టెక్నాలజీద్వారా మరో 33వేల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది
►రివర్స్ పంపింగ్ టెక్నాలజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి విషయంలో జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని తీసుకురావాలని కోరుతున్నాను
►విద్యా రంగంలో నాడు – నేడు కార్యక్రమాన్ని చేపట్టాం
►46 వేల ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలను, ప్రభుత్వ హాస్టళ్లను ఈ కార్యక్రం కింద బాగుచేస్తున్నాం
►అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇంగ్లిషు మీడియంను తీసుకువచ్చాం
►ఆరోగ్య రంగంలో కూడా నాడు– నేడు చేపట్టాం:
►పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రుల్లో నాడు – నేడు కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం:
►గ్రామాల్లో 10వేలకుపైగా విలేజ్ క్లినిక్స్‌ను ప్రారంభిస్తున్నాం
►కొత్తగా మరో 16 వైద్య కళాశాలలను నిర్మించబోతున్నాం
►ఇప్పటికే కేంద్రం 3 కాలేజీలకు అనుమతి ఇచ్చింది
►మరో 13 కాలేజీలకు అనుమతులు మంజూరుచేయాలని కోరుతున్నాం
►పరిపాలనలో సంస్కరణలు తీసుకు వచ్చాం
►వికేంద్రీకరణే కాకుండా సమర్థవంతంగా టెక్నాలజీని వాడుకుంటున్నాం
►అవినీతి, వివక్షకు తావులేకుండా పథకాలను, సేవలను అందిస్తున్నాం
►15 వేల గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం
►ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ను పెట్టాం
►540 రకాల అత్యవసర సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందిస్తున్నాం
►అన్ని గ్రామాలకూ ఇంటర్నెట్ సదుపాయం అందించడం ద్వారా ఈ సేవలు మరింత మెరుగుపడతాయి
►భారత్ నెట్ ప్రాజెక్ట్ దిశలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలను చేపడుతుంది
►గ్రామస్థాయిలో ప్రతి పౌరుడికీ, ప్రభుత్వ వ్యవస్థకూ ఇంటర్నెట్‌సదుపాయాన్ని అందిస్తాం
►గ్రామాల్లో పబ్లిక్ డిజిటల్ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకు వచ్చి వర్క్‌హోంను అందుబాటులోకి తీసుకు వస్తాం