Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో హారన్ కొడితే భారీ జరిమానా.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

తిరుమల పుణ్యక్షేత్రంలో పవిత్ర ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడేందుకు, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), పోలీసు యంత్రాంగం సంయుక్తంగా 'నో హారన్ జోన్' నిబంధనను ఎంతో కఠినంగా అమలు చేస్తున్నాయి.

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో హారన్ కొడితే భారీ జరిమానా.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
Tirumala Ghat Road (Photo-TTD)

Tirumala : తిరుమల పుణ్యక్షేత్రంలో పవిత్ర ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడేందుకు, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), పోలీసు యంత్రాంగం సంయుక్తంగా 'నో హారన్ జోన్' నిబంధనను ఎంతో కఠినంగా అమలు చేస్తున్నాయి. కొండపై అనవసరంగా వాహనాల హారన్లు, సైరన్లు మోగించడంపై పూర్తిస్థాయి నిషేధం విధించారు. నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై మోటారు వాహన చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటూ, భారీగా జరిమానాలు విధిస్తున్నారు.

గడిచిన ఆరు నెలల కాలంలోనే శబ్ద కాలుష్యానికి కారణమైన 42 వాహనాలపై కేసులు నమోదు చేసి.. వారి నుంచి రూ.64,475 జరిమానా వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తిరుమలలోని జీఎన్‌సీ టోల్‌గేట్ నుంచి ప్రారంభించి.. రెండు ఘాట్ రోడ్లతో పాటు కొండపై ఉన్న అన్ని ప్రాంతాల్లో ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ రూల్ చాలా కాలంగా అమల్లో ఉన్నప్పటికీ.. కొంతమంది వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ నిఘాను మరింత తీవ్రతరం చేశారు.

ఈ నెలలో 20 తర్వాత వచ్చే ముఖ్యమైన పండుగలు ఇవే, హిందూ పంచాంగం ప్రకారం జూలై 2026లో ముఖ్యమైన పర్వదినాలు, వ్రతాలు గురించి తెలుసుకోండి

తిరుమల పవిత్రతను కాపాడుతూ, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అత్యంత ప్రశాంతమైన వాతావరణాన్ని అందించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. కొండపైకి వచ్చే సొంత వాహనదారులు, ట్యాక్సీ డ్రైవర్లు ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. కేవలం అత్యవసర పరిస్థితుల్లో వచ్చే అంబులెన్సులు, వీవీఐపీ ప్రోటోకాల్ వాహనాలకు మాత్రమే సైరన్ ఉపయోగించేందుకు పరిమిత వెసులుబాటు కల్పించారు.

ఈ నిబంధనల అమలును నిరంతరం పర్యవేక్షించేందుకు పోలీస్ కమాండ్ కంట్రోల్ విభాగం ఆధ్వర్యంలో 2000కు పైగా సీసీ కెమెరాలతో కొండపై నిఘా ఏర్పాటు చేశారు. హారన్ మోగించి నిబంధనలు అతిక్రమిస్తే కెమెరాల ద్వారా గుర్తించి నేరుగా చలాన్లు పంపుతామని హెచ్చరించారు. ఆలయాలు మరియు ప్రశాంత ప్రదేశాలలో పగటిపూట 50 డెసిబుల్స్, రాత్రివేళల్లో 40 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం ఉండకూడదనే పర్యావరణ నిబంధనల ప్రకారమే తిరుమలలో 'నో హారన్ జోన్' అమలు చేస్తున్నామని వెల్లడిస్తూ, భక్తులందరూ ఈ ప్రశాంతతను కాపాడటంలో సహకరించాలని కోరారు.

(The above story first appeared on LatestLY on Jul 24, 2026 04:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).