Hyderabad, NOV 26: కొత్త తరహా మోసాలతో సైబర్ చీటర్స్ (Cyber Cheters) రెచ్చిపోతున్నారు. సైబర్ నేరాలపై ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ, కొత్త కొత్త పేర్లు చెప్పి మోసాలు చేస్తున్నారు. దీంతో వారి వలలో అమాయకులు చిక్కి లక్షల్లో మోసపోతున్నారు. సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) సామాన్యులనే కాదు సెలబ్రెటీలను కూడా వదలడం లేదు. తాజాగా సినీ నటి, ప్రొడ్యూసర్ జీవితా రాజేశేఖర్‌కు (Jeevitha Rajashekar) సైబర్ నేరగాడు కుచ్చుటోపీ పెట్టాడు. జియో బహుమతులను సగం ధరకే అందజేస్తామని నమ్మించి లక్షన్నర రూపాయలు టోకరా వేశాడు. ఇటీవల జీవితా రాజశేఖర్ ఇంట్లోకి జియో వైఫై కనెక్షన్ తీసుకున్నారు. దాని తర్వాత కొద్దిరోజులకు జీవితకు ఒక కాల్ వచ్చింది. తమ ఇంట్లో వైఫై ఇన్‌స్టాల్ చేసింది తానేనని చెప్పుకున్న ఓ వ్యక్తి.. తనకు ప్రమోషన్ వచ్చిందని చెప్పాడు. ఇప్పుడు జియో వస్తువుల (Jio Products) అమ్మకాలు జరుపుతున్నానని.. అవి అమ్మితే తనకు మరో ప్రమోషన్ వస్తుందని తెలిపాడు. సగం ధరకే జియో బహుమతులు అందజేస్తానని.. తన ప్రమోషన్ కోసం సహకరించాలని నమ్మబలికాడు. ఇందుకోసం తెలిసిన వాళ్ల పేర్లను వాడుకున్నాడు. అవతలి వ్యక్తి అంతగా వేడుకోవడంతో విషయమేంటో కనుక్కోమని.. జీవితా రాజశేఖర్ తన మేనేజర్లకు చెప్పారు. దీంతో జీవిత మేనేజర్ అతనితో మాట్లాడాడు.
సగం ధరకే జియో బహుమతులు అందిస్తానని తెలిసిన వారి పేర్లను చెప్పి నమ్మించడంతో మేనేజర్ ఒప్పుకున్నాడు. సైబర్ నేరగాడు ఇచ్చిన జాబితాలో నుంచి పలు వస్తువులను ఎంచుకున్నాడు. అయితే వీటికి సంబంధించిన టోకెన్ అమౌంట్ పంపించాలని సైబర్ నేరగాడు అడిగాడు. అతన్ని పూర్తిగా నమ్మిన మేనేజర్ వెంటనే లక్షన్నర రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ కావడంతో సైబర్ నేరగాడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన మేనేజర్.. జీవితకు అసలు విషయం చెప్పాడు. దీంతో హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు జీవితా రాజశేఖర్ ఫిర్యాదు చేశారు.
జీవితా రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber Crime police) విచారణ మొదలుపెట్టారు. సైబర్ నేరగాడి సెల్‌ఫోన్ డేటా ఆధారంగా నిందితుడు చెన్నైకి చెందిన నరేశ్‌గా గుర్తించారు. నిందితుణ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, నరేశ్ గతంలో కూడా ఇదే తరహాలో పలువురు సినీనటులు, ప్రొడ్యూసర్లను మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.