High Court of Telangana | (Photo-ANI)

Hyd. Nov 25: తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో (MLAs Poaching Case) బీజేపీ కీలక నేత, కర్ణాటకకు చెందిన సీనియర్‌ పొలిటీషియన్‌ బీఎల్‌ సంతోష్‌కు ఊరట లభించింది. సిట్‌ నోటీసులపై ( SIT notice) తెలంగాణ హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. సిట్‌ నోటీసులను సవాల్‌ చేస్తూ బీఎల్‌ సంతోష్‌ (BJP’s BL Santosh) ఇవాళ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన క్వాష్‌ పిటిషన్‌లో.. సిట్‌ నోటీసులను రద్దు చేయాలని కోరారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసులో రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వమే జోక్యం చేసుకుంటోందని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ తరపున వాదించిన సీనియర్ కౌన్సిల్ దేశాయ్ ప్రకాష్ రెడ్డి ప్రకాష్ రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు.ఈ కేసులో బీఎల్ సంతోష్ నిందితుడు కాదు, అనుమనితుడు కూడా కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పారదర్శకంగా విచారిస్తుందన్న నమ్మకం లేదన్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో 5గురికి నోటీసులు, విచారణకు హాజరు కాకుంటే అరెస్ట్‌ చేస్తామని హెచ్చరికలు జారీ చేసిన సిట్

రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు, కేసుల పేరుతో వేధిస్తోందని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో రాజకీయ దురుద్దేశం ఉందని, కేసును క్వాష్ చేయాలని వాదించారు. బీఎల్ సంతోష్‌పై నమోదైన కేసులు, నోటీసులను నిలిపివేయాలని కోరారు. ఎఫ్‌ఐఆర్‌లో బీఎల్ సంతోష్ పేరు లేదని, ఇప్పుడు ఎలా నిందితుడుగా చేరుస్తారని ప్రకాష్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

అయితే బీఎల్ సంతోష్‌పై పక్కా ఆధారాలు ఉన్నాయని ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. 41 సీఆర్‌పీసీని అనుసరించి గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏజీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే 41 సీఆర్‌పీసీ నోటీసులపై స్టే విధించిన హైకోర్ట్ తదుపరి విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసింది.అంతకు ముందు.. ఫాంహౌజ్‌ కేసులో మరో దఫా బీఎల్‌ సంతోష్‌కు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీంతో.. ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ సిట్‌ నోటీసులు జారీ చేసింది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఊహించని ట్విస్ట్, బీజేపీ నేత సంతోష్‌తో పాటు జగ్గు స్వామికి లుకౌట్‌ నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు

విచారణకు హాజరుకావాలంటూ బీఎల్ సంతోష్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు ఇటీవలే నోటీసులు జారీ చేశారు. సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసి ఈ నెల 21న ఉదయం పదిన్నరకు కమాండ్ కంట్రోల్‌లోని సిట్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసులో సిట్ అధికారులు స్పష్టం చేశారు. అయినా బీఎల్ సంతోష్ హాజరుకాలేదు. దీంతో విచారణకు రావాలంటూ సిట్ అధికారులు బీఎల్ సంతోష్‌కు మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపైనే హైకోర్టు నేడు స్టే విధించింది.

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) అధ్యక్షతన ఇటీవలే సిట్‌ను ఏర్పాటు చేశారు. ఆరుగురు పోలీస్ ఉన్నతాధికారులతో ఆరుగురు సభ్యులుగా ఉంటారు. నల్గొండ ఎస్పీ రాజేశ్వరి, సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ కల్మేశ్వర్‌, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగాధర్‌, శంషాబాద్‌ డీసీపీ జగదేశ్వర్‌రెడ్డి, మొయినాబాద్‌ సీఐ లక్ష్మిరెడ్డిలను సిట్‌ సభ్యులుగా ఎంపిక చేశారు.