MLAs Poaching Case (Photo-ANI)

Hyd, Nov 25: తెలంగాణతో పాటుగా దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో (MLAs Poaching Case) సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసిన సిట్ (SIT) మరో అయిదుగురికి తాజాగా నోటీసులు జారీ చేసింది. కేరళ వైద్యుడు జగ్గుస్వామి సోదరుడు మణిలాల్‌లోపాటు సిబ్బంది శరత్‌, ప్రశాంత్‌, విమల్‌, ప్రతాపన్‌కు నోటీసులు ఇచ్చింది. వీరందరికీ 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసింది. ఈసారి కూడా విచారణకు హాజరు కాకుంటే అరెస్ట్‌ చేస్తామని హెచ్చరించింది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఊహించని ట్విస్ట్, బీజేపీ నేత సంతోష్‌తో పాటు జగ్గు స్వామికి లుకౌట్‌ నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు

ఇక ఎమ్మెల్యేలకు ఎర కేసులోని (TRS MLAs Poaching Case) ముగ్గురు నిందితుల రిమాండ్‌ గడువు ముగియడంతో వారిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజిలకు వచ్చేనెల 9 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నంద కుమార్ భార్య చిత్ర లేఖ, న్యాయవాదులు ప్రతాప్‌ గౌడ్‌, శ్రీనివాస్‌లు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులతో సంబంధాలపై సిట్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలు.. ప్రతాప్ గౌడ్, నందకుమార్ ట్రాన్సెక్షన్‌పై విచారిస్తున్నారు. రామచంద్ర భారతి, సింహయాజులు తో పరిచయాలపై ప్రశ్నిస్తున్నారు.