Revanth Reddy Telangana CM (Photo-Video Grab)

ఫిబ్రవరి 13న కాళేశ్వరం ప్రాజెక్టును అఖిలపక్షం సందర్శించనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ... బీఆర్ఎస్ నేతలు బుకాయిస్తే నిజాలు దాగవు. ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని ఈనెల 13న కాలేశ్వరం ప్రాజెక్టుకు వెళ్దాం. మేడిగడ్డకు వెళ్తే బిఆర్ఎస్ బాగోతం బయటపడుతుంది. ఈ సభ నుంచే కేసీఆర్ ను ఆహ్వానిస్తున్నా. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. కృష్ణా జలాలను పంచుకోవడం, నదిపై ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ)కి అప్పగించే అంశంపై తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు, 17 మంది లోక్‌సభ, ఏడుగురు రాజ్యసభ సభ్యులకు ఫిబ్రవరి 13న కాళేశ్వరం సందర్శనార్థం రాష్ట్ర ప్రభుత్వం తరపున బస్సులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పగుళ్లు దారితీయడానికి కారణం బీఆర్‌ఎస్‌ హయాంలో లోపభూయిష్టంగా ఉన్న ప్రాజెక్టు డిజైన్‌, పనుల నాణ్యతా లోపమే కారణమని సీఎం రేవంత్ ఎండగట్టారు. మేడిగడ్డ బ్యారేజీలో పగుళ్లు ఏర్పడిన నేపథ్యంలో గత ప్రభుత్వం రూ.1 లక్ష కోట్లకుపైగా నిధులను ఎలా వృథా చేసిందో పరిశీలించి అంచనా వేయడానికి ఈ పర్యటన చేయనున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు.

ఈ కాళేశ్వరం యాత్రలో పాల్గొనాలని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. నవంబర్ 30న అసెంబ్లీ పోలింగ్ రోజున ఏపీ పోలీసు బలగాలను మోహరించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఆక్రమించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ ఈ సందర్భంగా ఆరోపించారు.