Rain Alert: తెలంగాణ‌కు రాబోయే రెండు రోజులు వ‌ర్ష‌సూచ‌న‌, ప‌లు జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ చేసిన ఐఎండీ
Credits: Twitter

Hyderabad, April 12: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా (Rain alert) చల్లబడింది. రెండు మూడు రోజుల కిందటి వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. ఇప్పుడు ఎండలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం నుంచి వాతావరణం చల్లబడటం ప్రారంభించింది. బుధవారం రాత్రి చల్లటి గాలులు వీయగా, గురువారం కూడా అలాంటి వాతావరణమే కొనసాగింది. శుక్రవారం నాటికి రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. సగటున 2 డిగ్రీల నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదు కావడం గమనార్హం. కాగా, రాష్ట్రంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అలాగే మరఠ్వాడ నుంచి మధ్య మహారాష్ట్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ (IMD Alert) వివరించింది. ఈ నేపథ్యంలోనే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించింది. దీని ప్రభావంతోనే రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Telangana Weather: నేడు, రేపు తెలంగాణలో వర్షాలు పడే ఛాన్స్‌.. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు 

ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కూడా కురవచ్చని సూచించింది. కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించింది. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అలాగే ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాలకు ఆరెంజ్‌తో పాటు ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌కు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సూర్యాపేట, మహబూబాబాద్‌, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీచేసింది. మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది.