పి.వెంకట్రామ్‌రెడ్డి (Image: Twitter)

సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామాను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ రీసెర్చ్ స్కాలర్లు ఆర్. సుబేందర్ సింగ్, జె శంకర్‌లు రాష్ట్ర హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఐఏఎస్ రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు తమ పిల్‌లో పేర్కొన్నారు. ఐఏఎస్‌లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారని.. వెంకట్రామిరెడ్డి నామినేషన్‌ను ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ఎలక్షన్‌ కమిషన్, శాసనమండలి కార్యదర్శి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను లంచ్ మోషన్‌గా స్వీకరించాలని సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి కోరగా.. ఇవాళ అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది.

ఇదిలా ఉంటే..సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామ్‌రెడ్డి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఐఏఎస్‌ నుంచి ఉద్యోగ విరమణ చేస్తున్నట్లు ఆయన పెట్టుకున్న దరఖాస్తును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. ఆ వెంటనే తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం వహించాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ ద్వారా రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెంకట్రామ్‌రెడ్డి వెల్లడించారు. అనంతరం రాత్రి తన సోదరుడితో కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ ఆశీస్సులు తీసుకున్నారు. వెంకట్రామ్‌రెడ్డి కొంతకాలంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఊహాగానాలు వెలువడుతుండగా, గత ఏడాది నవంబర్‌లో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార పార్టీ తరపున ఆయన పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది.