Hyderabad, April 14: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం నగరంలో పలు కొవిడ్ ఆస్పత్రులను (Covid Hospitals) సందర్శించారు. గచ్చిబౌలిలోని టిమ్స్, సికింద్రాబాద్ పరిధిలోని గాంధీ ఆస్పత్రి, కింగ్‌కోఠి ఆస్పత్రిను ఆయన పరిశీలించారు. ఆయా హాస్పిటల్లో కొవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు చేస్తున్న ఏర్పాట్లు, ఔషధాలు, సిబ్బంది, మౌలిక వసతులు తదితరాలను ఆయన తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన సేవలందించేలా చూడాలని సిబ్బందికి సూచించారు. వైద్య సిబ్బంది మానవతావాదంతో సేవలు అందించాలని చెప్పారు.
కరోనా మొదటి వేవ్‌కు.. రెండో వేవ్‌కు చాలా తేడా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ (minister etela rajender) తెలిపారు. మొదటి వేవ్‌లో 20 శాతం మంది మాత్రమే ఆసుపత్రిలో చేరారని, రెండో వేవ్‌లో 95 శాతం మంది ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో మొత్తం 47 వేల పడకల్లో సగానికిపైగా కొవిడ్ రోగుల చికిత్సకు వినియోగిస్తున్నామని వెల్లడించారు. సీరియస్ కేసులు వస్తే ప్రైవేట్ ఆసుపత్రులు గాంధీ దవాఖానకు పంపుతున్నాయి. ఈ సమయంలో ఎవరూ ధర్నాలు చేయొద్దని మంత్రి సూచించారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.
తెలంగాణలో (TS Coronavirus) నాలుగు వారాలుగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. మరో ఆరు వారాలు ఇదే పరిస్థితి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు సహకరించక పోతే తెలంగాణ కూడా మహారాష్ట్రగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముందు ముందు ఆస్పత్రిలో బెడ్స్ దొరక్కుండా పోయే ప్రమాదం ఉందని చెప్పారు.
ఆర్ధిక ఇబ్బందులు రావద్దని లాక్ డౌన్, కర్ఫ్యూ వంటివి పెట్టడం లేదన్నారు. పరిస్థితి తెలంగాణలోనూ తీవ్రంగా ఉందని చెప్పారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. ఇప్పుడు ఉన్న వైరస్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతుందని శ్రీనివాసరావు తెలిపారు. గాలి ద్వారా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోందని ఆయన తెలిపారు.
ఇప్పటి వరకు బయట ఉన్నప్పుడు మాత్రమే మాస్కులు వేసుకోవాలని చెప్పామని... ప్రస్తుత పరిస్థితిలో ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించాలని సూచించారు. ఇంట్లో ఒకరికి కరోనా సోకితే మిగిలిన వారికి కూడా చాలా వేగంగా గంటల వ్యవధిలోనే సోకుతుందని అన్నారు. లాక్ డౌన్ విధిస్తే ఆర్థిక సమస్యలు ఉత్పన్నమవుతాయని, ప్రజల జీవనోపాధి దెబ్బ తింటుందనే ఉద్దేశంతో దాన్ని విధించడం లేదని శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందని, చాలా వేగంగా వైరస్ విస్తరిస్తోందని చెప్పారు.
కరోనా తీవ్రత పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దుల్లో కఠినచర్యలు తీసుకుంటోంది. మహారాష్ట్రతో సరిహద్దు కలిగిన ప్రాంతాల్లో కరోనా కేసులతో ప్రమాదకర సూచనలు కనబడుతున్నాయి. సలాబత్ పూర్, సాలూరా, కందకుర్తి అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద మహారాష్ట్ర నుంచి రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి ప్రత్యేకంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
రోజుకు 20కి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ వచ్చిన వారిని వైద్య సిబ్బంది వెనక్కి పంపేస్తున్నారు. నిజామాబాద్, హైదరాబాద్ ఆస్పత్రుల్లో చికిత్స కోసం మరాఠా రోగులు క్యూ కడుతున్నారు. దీంతో సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పూర్తిగా పరిశీలించాకే తెలంగాణలోకి రావడానికి అనుమతి ఇస్తున్నారు.
రాష్ట్రంలో నమోదు అవుతోన్న పాజిటివ్ కేసుల్లో 43 శాతం 21-45 ఏళ్ల గ్రూపులోనివారివేనని వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల చెబుతున్నాయి. మార్చి రెండో వారం నుంచి రాష్ట్రంలో సెకండ్‌వేవ్ ప్రారంభమైంది. మార్చి 12 నుంచి కేసులు పెరుగుతుండగా, నెల రోజుల వ్యవధిలో ఏకంగా 28,812 పాజిటివ్‌లు వచ్చాయి. అందులో 12,677 మంది 21-45 ఏళ్లలోపువారే.
ఇక మరణాల విషయంలోనూ ఇతర దీర్ఘకాలిక లక్షణాలున్న వారు 56 శాతం ఉంటే, ఎటువంటి జబ్బుల్లేకుండా కేవలం కొవిడ్ వల్లే చనిపోయిన వారు 44 శాతం మంది ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వైర్‌సతో 1,765 మంది చనిపోగా అందులో 776 మంది 21-45 ఏళ్లలోపువారే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువగా ఆ వయసువారే చికిత్స తీసుకుంటున్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి.
నల్లగొండ జిల్లా చందంపేట మండలం మోత్య తండాలో కరోనా కలకలం రేపుతోంది. గత నెల 29న కొండమల్లేపల్లి మండలం గౌరికుంట తండాలో హోలీ వేడుకల్లో పాల్గొన్న మోత్య తండా వాసులు 61 మందికి తాజాగా పాజిటివ్ వచ్చింది. వీరంతా తీవ్ర జ్వరం, దగ్గు, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
దీంతో సోమవారం 121 మందికి పరీక్షలు నిర్వహించగా 61 మందికి వైరస్ నిర్ధారణ అయింది. కాగా, గౌరికుంట తండా వాసులు వందమందికి గత వారం కరోనా సోకింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు ఆలయ ప్రఽధాన అర్చకుడు, సహాయ అర్చకులు సహా 12 మంది సిబ్బందికి పాజిటివ్ వచ్చింది. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం కోతుల కుంట తండాలో 14 మందికి పాజిటివ్ వచ్చింది.