New Delhi, April 14: దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఒక్క రోజులోనే ఏకంగా 1027 మందిని (1,027 Deaths in Past 24 Hours) పొట్టనబెట్టుకుంది. దీంతో మృతుల సంఖ్య 1,72,085 కు పెరిగింది. ఇక కేసుల సంఖ్యలో కొత్త రికార్డు (Highest Single Day Spike in Coronavirus Cases So Far)నమోదైంది. 24 గంటల్లో ఏకంగా 1,84,372 కేసులు (India Reports 1,84,372 New COVID-19 Cases) నమోదయ్యాయి.
పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు, నైట్ కర్ఫ్యులు పెట్టినా ఫలితం లేకుండా పోతోంది.ఇక 24 గంటల్లో 82,339 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వాళ్ల సంఖ్య 1,38,73,825కు చేరుకోగా.. కోలుకున్న వాళ్లు 1,23,36,036గా ఉన్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 13,65,704 ఉన్నాయి.
వరుసగా నాలుగో రోజూ ఇండియాలో లక్షన్నరకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇక అమెరికా తర్వాత ఒకే రోజులో ఇన్ని కేసులు వచ్చిన దేశం కూడా ఇండియానే. కరోనా సెకండ్ వేవ్‌కు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. కేసులు ఆందోళకర స్థాయిలో పెరిగిపోతుండటంతో ఇప్పటికే వివిధ దేశాల్లో అనుమతి పొందిన విదేశీ టీకాల వినియోగానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. దేశంలో నిన్నటి వరకు మొత్తం 26,06,18,866 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 14,11,758 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
మహారాష్ట్రలో రేపటి నుంచి 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు సీఎం ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. రేపు ఉదయం 8 గంటల నుంచి 15 రోజుల పాటు కఠినమైన ఆంక్షలు విధిస్తున్నామని చెప్పారు. ప్రజలు భారీగా గుమికూడరాదని స్పష్టం చేశారు. నలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడడం నిషిద్ధమని వివరించారు. కరోనా వ్యాప్తి గొలుసును విచ్ఛిన్నం చేయడానికి ఇంతకంటే మరో మార్గంలేదన్నారు. మరోసారి యుద్ధం ప్రారంభమైందని భావిస్తున్నామని, అయితే దీన్ని లాక్ డౌన్ అని పిలవలేమని అన్నారు.
ప్రజలు అనవసర ప్రయాణాలు చేయరాదని హితవు పలికారు. ప్రజా రవాణా వ్యవస్థను, రైళ్లను, బస్సులను నిలిపివేయడంలేదని, వాటిని అత్యవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు. మెడికల్, బ్యాంకులు, మీడియా, ఈ కామర్స్, ఇంధన సేవలపై ఎలాంటి ఆంక్షలు లేవని అన్నారు.ఇవాళ రాష్ట్రంలో 60,212 కరోనా కేసులు వచ్చాయని వెల్లడించారు.
వైద్య, ఆరోగ్య వసతులను నిరంతరం మెరుగుపరుస్తూనే ఉన్నామని, అయితే కరోనా కేసులు అధికంగా ఉండడంతో ఒత్తిడి పెరిగిపోతోందని తెలిపారు. ఆక్సిజన్, పడకల కొరత ఏర్పడిందని, రెమ్ డెసివిర్ ఔషధం కోసం అధిక డిమాండ్ ఏర్పడిందని థాకరే వివరించారు. పొరుగు రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు ఆక్సిజన్ రోడ్డు మార్గాన కాకుండా వాయుమార్గాన అందేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరానని, ఈ విషయంలో ఆర్మీ సేవలను అడిగానని పేర్కొన్నారు.