Facebook: పేరు మార్చుకున్న ఫేస్‌బుక్‌, కొత్త లోగో ఆవిష్కరించిన జుకర్‌ బర్గ్‌, ఇకనుంచి కొత్త పేరు మీదనే అన్ని సేవలు

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సంస్థ పేరు మార్చుకుంది. దీనిపై అధికారిక ప్రకటన చేశారు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్. ఫేస్‌బుక్ కార్పొరేట్ పేరు ఇకపై మెటాగా రూపాంతరం చెందనుంది. కంపెనీ కనెక్ట్‌ ఈవెంట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. మెటాకు సంబంధించిన కొత్త లోగోను కూడా ఆవిష్కరించారు.

మెటావర్స్‌లో భాగంగా పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు జుకర్‌బర్గ్‌ తెలిపారు. వర్చువల్‌–రియాలిటీ స్పేస్‌లో రానున్న కాలంలో వినియోగదారులు ఎటువంటి అంతరాయం లేని అత్యున్నత స్థాయి సాంకేతిక సేవలను వినియోగం, మెటావర్స్‌ పరిధిలోకి వస్తాయి. యాప్స్‌ నుంచి మరింత సాంకేతిక పరిపక్వత కలిగిన మెటావర్స్‌ దిశగా మెటా అడుగులు వేస్తుందని జుకర్‌బర్గ్‌ తెలిపారు.

Here's Meta Update

ఫేస్‌బుక్ పేరుమార్పునకు సంబంధించి సుధీర్ఘమైన వివరణ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒకరికి ఒకరిని కలిపి ఉంచడానికి సాంకేతికతను ఆవిష్కరించే కంపెనీ మనది. వెరసి మన సాంకేతికతలో ప్రజలను ఒక చోటు కేంద్రీకరించవచ్చు. తద్వారా అందరూ కలిసి ఆర్థిక వ్యవస్థ మరింత పురోగతికి దోహదపడవచ్చు’’ అని ఈ సందర్భంగా జుకర్‌బర్గ్‌ చెప్పారు. ‘‘ప్రస్తుత బ్రాండ్‌ ఇకపై మనకు కావాల్సిన సేవల అన్నింటినీ అందించలేకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో మనం భవిష్యత్తుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ దిశలోనే మన సంస్థ బ్రాడ్‌ పేరు మారింది’’ అని కూడా ఆయన తెలిపారు.

ఇటీవల ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టా గ్రామ్ సేవలు దాదాపు ఏడు గంటల పాటూ నిలిచిపోయాయి. దీంతో ఫేస్‌బుక్ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతకుముందు నుంచే భద్రత విషయంలో ఫేస్‌బుక్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలో ఫేస్‌బుక్ పేరు మార్పు చర్చనీయాంశంగా మారింది. ఇంతకుముందు ఫేస్‌బుక్‌ కింద కొనసాగిన సామాజిక మాధ్యమాలు– ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లు ఇకపై మెటా కింద కొనసాగుతాయి. అంటే మాతృసంస్థ పేరుమాత్రమే మారింది తప్ప, దానికింద ఉండే సామాజిక మాధ్యమాల సేవలు పాతపేర్లతోనే కొనసాగుతాయి.