Hybrid Beef Rice : అన్నంలో మాంసం కలుపుకొని తినడం అందరికీ తెలిసిందే. కానీ ఆ అన్నమే మాంసంతో తయారైందేతే ఎలా ఉంటుంది? దానిని వండితే ఆ రుచి ఎలా ఉంటుంది? అటువంటి అన్నం మీరు తినేందుకు ఇష్టపడతారా? చెప్పలేం, మున్ముంది ఇలాంటి అన్నం మాత్రమే మనకు అందుబాటులో ఉంటుంది కావచ్చు. ఎందుకంటే, 'మాంసాహార బియ్యం' ను సైంటిస్టులు సృష్టించారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..
దక్షిణ కొరియాలోని యోన్సీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం సరికొత్త హైబ్రిడ్ వరి వంగడాన్ని సృష్టించారు, గొడ్డు మాంసంతో ల్యాబ్‌లో మాంసాహార బియ్యంను తయారు చేశారు. ఈ రకమైన బియ్యపు గింజలు బోవిన్ కొవ్వు కణాలు, మాంసపు కండరాలతో నిండి ఉంటాయి.
ఫిష్ జెలటిన్‌లో సాంప్రదాయ వరి గింజలను కప్పి, వాటిని అస్థిపంజర కండరం, కొవ్వు మూలకణాలతో విత్తడం ద్వారా శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా మాంసాహార బియ్యం తయారు చేశారు, ఇలా ప్రయోగశాలలో తొమ్మిది నుండి 11 రోజుల పాటు కండరాలు, కొవ్వు మరియు జెలటిన్-స్మోటెర్డ్ బియ్యాన్ని కల్చర్ చేసిన తర్వాత, ధాన్యాలు అంతటా మాంసం, కొవ్వును కలిగి ఉంటాయి, ఫలితంగా తుది ఉత్పత్తి పుష్టికరమైన, సువాసనగల ఆహారంగా మారుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ప్రయోగశాలలో తయారు చేసిన గొడ్డు మాంసం-కల్చర్డ్ రైస్‌ను హెచ్ఓడీ, ప్రొఫెసర్ జింకీ హాంగ్ వండటమే కాకుండా రుచి చూశారు. తన అనుభవాన్ని ఆయన తన నివేదికలో పొందుపరిచారు. వండినప్పుడు ఆ బియ్యం దాని సాంప్రదాయ రూపాన్ని కలిగి ఉంటుంది, కానీ గులాబీ రంగులో ఉంటుంది, అలాగే కొద్దిగా మాంసపు లక్షణాన్ని, ప్రత్యేకమైన సువాసనను కలిగి ఉంటుంది అని జింకీ హాంగ్ చెప్పారు.
మృదువుగా అంటుకునే సాంప్రదాయ బియ్యం కంటే హైబ్రిడ్ బియ్యం కొంచెం దృఢంగా, పెళుసుగా ఉంటుంది, కానీ ఇందులో 8% ఎక్కువ ప్రోటీన్ మరియు 7% ఎక్కువ కొవ్వు ఉంటుంది. ఈ బియ్యం గొడ్డు మాంసం, బాదం వంటి వాసనను కలిగి ఉంటుంది, అలాగే క్రీమ్, వెన్న మరియు కొబ్బరి నూనె వాసన వస్తుందని మేటర్ జర్నల్ నివేదించింది.
మాంసాహారం బియ్యం సృష్టికి గల కారణం
పరిశోధకుల బృందంలో ఒకరైన సోహియోన్ పార్క్ ప్రకారం, ఒకవైపు వనరులు తగ్గిపోతున్నాయి, మరోవైపు పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడం కోసం సుస్థిరమైన ఆహారం గురించి ఆలోచించినట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. "సాధారణంగా జంతువుల నుండి మనకు అవసరమైన ప్రోటీన్‌ను పొందుతాము, అయితే జంతువులను పెంచడానికి చాలా వనరులు అవసరం అవుతాయి, ఇది వాతావరణంలో గ్రీన్‌హౌస్ వాయువు విడుదలను పెంచుతుంది. వరి పండించటానికి ఎక్కువ నీరు, శ్రమ అవసరం అవుతాయి. బదులుగా తక్కువ శ్రమతో తక్కువ వనరులను ఉపయోగించి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ కలయికలో ఆహారం ఉంటే అది సరసమైనదిగా ఉంటుంది" అని అన్నారు. సెల్-కల్చర్డ్ ప్రోటీన్ రైస్ నుండి మనకు అవసరమైన అన్ని పోషకాలను పొందడం గురించి ఆలోచించాలి అని తెలిపారు.
ఈ హైబ్రిడ్ బియ్యం, అచ్చంగా గొడ్డు మాంసం రుచిని ప్రతిబింబించనప్పటికీ, ఇది ఒక ఆహ్లాదకరమైన వంటకం, ఒక విభిన్నమైన రుచి అనుభవాన్ని అందిస్తుందని పరిశోధకులు అంటున్నారు.
ఇలాంటి బియ్యం మార్కెట్లోకి వస్తే ప్రజలు స్వీకరిస్తారా? లేదా అనేది వేచి చూడాల్సిందే. అయితే, ఈ తరహా ఆహారం భవిష్యత్తులో కరువు పరిస్థితులు తలెత్తినప్పుడు, సైనికులకు రేషన్ లేదా అంతరిక్ష ఆహారానికి కూడా ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందని పరిశోధకులు అంటున్నారు.