Washington, December 10: భారత పౌరసత్వ (సవరణ) బిల్ 2019 (CAB 2019)ను "తప్పుడు దిశలోని ప్రమాదకరమైన మలుపు" గా అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడం (USCIRF) సంస్థ అభివర్ణించింది. మత ప్రాతిపదికన తయారు చేసిన బిల్లు తీవ్ర ఆందోళన కలిగించే విషయం అని పేర్కొంది. ఈ బిల్లు భారత పార్లమెంట్ ఆమోదం పొందితే, హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సహా ఇతర ప్రధాన భారత నాయకత్వానికి వ్యతిరేకంగా అమెరికా ఆంక్షలు విధించే అంశాలను పరిశీలించాలని సూచించింది.
సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఈ పౌరసత్వ సవరణ చట్టం వలసదారులకు ఒక చట్టపరమైన మార్గాన్ని నిర్ధేషించేలా ఉందని, ముస్లింలను మినహాయించి మతాల ఆధారంగా పౌరసత్వాన్ని నిర్ణయించేలా ఉందని USCIRF ఆరోపించింది.
ఈ బిల్లు భారతదేశ ఘనమైన లౌకిక చరిత్రకు భంగం కలిగిస్తుందని మరియు మతాలతో సంబంధం లేకుండా భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా, సమానత్వపు హక్కుకు వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడింది.
లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడంపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు యుఎస్‌సిఐఆర్‌ఎఫ్ తెలిపింది.
పార్లమెంటు ఉభయ సభలలో CAB ఆమోదం పొందినట్లయితే, అమెరికా ప్రభుత్వం హోంమంత్రి అమిత్ షా మరియు ఇతర ప్రధాన భారత నాయకత్వానికి వ్యతిరేకంగా ఆంక్షలను విధించాలి అని యూఎస్ కమిషన్ సూచించింది. NRC ప్రక్రియ పైనా యూఎస్ ఫెడరల్ కమీషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
USCIRF is deeply troubled by the passage of the Citizenship (Amendment) Bill (CAB) in the Lok Sabha. The CAB enshrines a pathway to citizenship for immigrants that specifically excludes Muslims, setting a legal criterion for citizenship based on religion.https://t.co/E8DafI6HBH
— USCIRF (@USCIRF) December 9, 2019
అయితే, తమ అంతర్గత వ్యవహారాలలో ఇతర దేశాలు జోక్యం చేసుకోకూడదని మోదీ సర్కార్ గతంలోనే చాలా సార్లు స్పష్టం చేసింది. ఇప్పుడు USCIRF చేసిన ఆరోపణలను కూడా కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చే అవకాశం ఉంది. ఇదే క్రమంలో మత స్వేచ్ఛపై సమీక్ష చేసేందుకు భారత్ వస్తామని తెలిపిన USCIRF సభ్యులకు పలు మార్లు వీసా ఇచ్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే భారత నాయకత్వంపై అమెరికా కూడా అంక్షలు విధించాలని USCIRF కోరుతుంది.
అసలు పౌరసత్వ సవరణ బిల్లు 2019 ఉద్దేశ్యం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం చెప్తున్న ప్రకారం.. ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ లలో మతపరమైన హింసకు గురై డిసెంబర్ 31, 2014 వరకు భారతదేశానికి వలస వచ్చిన ముస్లిమేతర అనగా హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ మరియు క్రైస్తవ వర్గాలకు చెందిన శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించేలా పౌరసత్వ (సవరణ) బిల్లు ప్రభుత్వం రూపొందించింది. సోమవారం లోక్ సభ ఆమోదం పొందిన ఈ బిల్లు, రాజ్యసభలోనూ ఆమోదం పొందితే చట్టరూపం దాల్చనుంది. దాని ప్రకారం ఆ మూడు దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులు దేశంలోని 28 రాష్ట్రాలు మరియు 9 కేంద్ర పాలిత ప్రాంతాలలో ఎక్కడైనా భారతీయ పౌరులుగానే చట్టబద్ధంగా, సమానమైన హక్కులతో జీవించవచ్చు.