Pakistan Elections 2024 (Representational Image; Photo Credit: X/ @ANI)

Islamabad, FEB 11: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వేళ జరిగిన జాతీయ జరిగిన ఎన్నికల్లో పాకిస్థాన్‌ (Pakistan elections) ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. ఏ పార్టీకీ మెజార్టీ రాకపోవడంతో మరోసారి సకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్నది. అయితే ఎన్నికల సందర్భంగా పలు బుతుల్లో రిగ్గింగ్‌ జరిగిందన్న ఆరోపణలు అధికమయ్యాయి. ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) నేతృత్వంలోని పీటీఐతోపాటు పలు పార్టీలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. దీంతో పాక్‌ ఎన్నికల సంఘం రీపోలింగ్‌ (Repolling) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 15న దేశవ్యాప్తంగా 40 పోలింగ్‌ కేంద్రాల్లో మళ్లీ పోలింగ్‌ (Pakistan) నిర్వహించనుంది. ఈనెల 8న పాక్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరిగింది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుండటంతో ఫలితాలు వెలువడలేదు. ఇప్పటికీ మరో ఏడు స్థానాలకు సంబంధించిన ఫలితాలు తేలాల్సి ఉంది. అయితే కౌంటింగ్‌ కొనసాగుతుండగా పలు కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Pakistan Elections: పాక్ ఎన్నిక‌ల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్, సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ 

266 స్థానాలున్న పాక్‌ జాతీయ అసెంబ్లీలో ఇప్పటివరకు 259 సీట్లలో ఫలితాలు వెలువడ్డాయి. జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ (PTI) మద్దతుదారులు 102 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరుకోవాలంటే మరో 31 చోట్ల గెలుపొందాల్సి ఉంది. కాగా, 73 సీట్లు సాధించిన మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సారథ్యంలోని పీఎంఎల్‌ (ఎన్‌) (PML-N), 54 సీట్లొచ్చిన బిలావల్‌ భుట్టోకు చెందిన పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) మరోసారి చేతులు కలిపాయి. ప్రభుత్వ ఏర్పాటు దిశగా రెండు పార్టీలు అడుగులు వేస్తున్నాయి.