ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేసే బ్రాండ్‌లలో బజాజ్ (Bajaj auto) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే కాకుండా దాదాపు 90కి పైగా దేశాల్లో బజాజ్ తన ద్విచక్ర వాహన వ్యాపారాన్ని విస్తరించి ఈ రంగంలో రారాజుగా రాణిస్తుంది. అయితే కేవలం విదేశాల్లో మాత్రమే విక్రయించడం కోసం ఆయా దేశాల్లోని యూత్ అభిరుచికి అనుగుణంగా బజాజ్ కొన్ని ప్రత్యేక మోడెల్స్‌ను తయారు చేస్తూ వస్తుంది. వాటిల్లో కొన్ని భారత మార్కెట్లో కూడా ప్రవేశపెడుతుంది. అలాంటి ప్రత్యేక బైక్ మోడెల్స్‌లలో 'బజాజ్ బాక్సర్' ఒకటి.

2011లో బజాజ్ బాక్సర్ భారత మార్కెట్లో విడుదల చేశారు. విదేశాల్లో బాగా ఆకట్టుకున్న ఈ మోడెల్ బైక్, ఇండియాలో మాత్రం ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. దీంతో మన దేశంలో ఈ బాక్సర్ బైక్ ఉత్పత్తి చేయడాన్ని బజాజ్ సంస్థ నిలిపివేసింది.

తాజాగా, ఈ బాక్సర్ బైక్‌కు మరిన్ని ఫీచర్లు, మరింత స్పోర్ట్స్ లుక్‌ను అద్దుతూ 2019 మోడెల్ గా 'బజాజ్ బాక్సర్ 150X' మోడెల్‌ను రష్యాలో విడుదల చేసింది. అక్కడ దీని ధర 87,500 రుబెల్స్. మన కరెన్సీ ప్రకారం రూ. 95,680/- . ఇందులో ఫీచర్స్ చూస్తే మీకూ ఈ బైక్ ను సొంతం చేసుకోవాలనిపిస్తుంది. దీనికి 5 గేర్లు, అలాగే గేర్ మార్పును తెలియజేసే ఒక సూచిక కూడా ఇచ్చారు. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునేందుకు USB ఛార్జర్ కలిగి ఉంది.

ఇక దీని లుక్ విషయానికి వస్తే కొంచెం స్పోర్ట్, కొంచెం వింటేజ్ లుక్‌తో వచ్చింది. పొడవైన సీట్, లగేజ్ ర్యాక్, పాత తరం ఇంధన ట్యాంకు ఇచ్చారు. కొండలు- రాళ్లు ఉండే మార్గంలో కూడా సునాయసంగా వెళ్లేలా దీని ముందు భాగం ఫెండర్ ఎక్కువ ఎత్తులో ఇచ్చారు. దీని ముందు, వెనక రెండు వైపులా డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు, కావాలనుకుంటే ముందు భాగంలో డిస్క్ బ్రేక్ అమర్చుకోవచ్చు. బ్లాక్ అలాయ్ వీల్స్ తో, డ్యుఎల్ కలర్ షేడ్లలో ఈ బైక్ అందుబాటులో ఉంది. ఇక మిగతాదంతా గతంలో విడుదలైన Boxer 150 మోడెల్ లాగే ఉంది, పైన చెప్పిన దానికి మించి ఎలాంటి మార్పులు చేసినట్లు కనిపించడం లేదు.

Bajaj Boxer 150X విశిష్టతలు..

ఇంజిన్ సామర్థ్యం 144.8 సిసి ఎయిర్ కూల్డ్ ఇంజిన్

12 hp పవర్ మరియు 12.3 Nm టార్క్

11 లీటర్ల ఫ్యుఎల్ ట్యాంక్ (2.5 లీటర్ల రిజర్వ్)

ఎలక్ట్రిక్ స్టార్ట్.

అయితే బజాజ్ సంస్థ ఈ బాక్సర్ 150X ఇండియా విడుదలపై ఎలాంటి ప్రకటన చేయలేదు, రానున్న పండగ సీజన్ లో పల్సర్ 125 సిసి (Bajaj Pulsar 125 CC) బైక్ తో పాటు మరికొన్ని కొత్త మోడెల్స్ ను ఇండియన్ మార్కెట్లో ప్రవేశ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆటోమొబైల్ విశ్లేషకులు చెబుతున్నారు.