Bajaj Chetak e-Scooter: త్వరలో విడుదల కాబోతున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్, పుణెలో ప్రదర్శనకు ఉంచిన బజాస్ సంస్థ, ఈ స్కూటర్ ధర, ఫీచర్లు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి
Bajaj Chetak Electric Scooter (File Photo)

ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటోమొబైల్స్ నుంచి విడుదలైన బజాజ్ చేతక్ స్కూటర్ (Bajaj Chetak Scooter) అంటే ఒకప్పటి 80's - 90's యూత్‌లో చాలా క్రేజ్ ఉండేది. అయితే మార్కెట్లో సరికొత్త బైక్స్ రావడం, మైలేజీ అంశాలు, నిర్మాణ వ్యయాలు ఎక్కువవడం, ఆటో రంగంలో తీవ్రమైన పోటీ కారణంగా 2005 లో ఈ స్కూటర్ మ్యాన్ ఫాక్ఛరింగ్ ను బజాజ్ సంస్థ పూర్తిగా నిలిపివేసింది.

అయితే మళ్లీ చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత సరికొత్తగా బజాజ్ స్కూటర్ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. నేటి అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా, పర్యావరణ హితంగా బజాజ్ చేతక్ ఇ-స్కూటర్‌ను రూపొందించారు.

మహారాష్ట్రలోని చకన్‌ (Chakan) కేంద్రంగా ఉత్పత్తి చేసే బజాజ్ సంస్థ, కొత్త స్కూటర్ ప్రమోషన్ లో భాగంగా చేపట్టిన 'చేతక్ ఎలక్ట్రిక్ యాత్ర' పూర్తయిన సందర్భంగా తన సరికొత్త చేతక్ ఇ-స్కూటర్‌ (e-scooter) ను పుణెలోని కార్పొరేట్ కార్యాలయంలో అధికారికంగా ప్రదర్శనకు ఉంచింది.

Chetak Electric Yatra Related Video:

ఈ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో బజాజ్ ఆటో చైర్మన్ రాహుల్ బజాజ్ (Rahul Bajaj) మాట్లాడుతూ బజాజ్ ద్వారా విడుదలవుతున్న తొలి ఎలక్ట్రిక్ వాహనం 'చేతక్ ఇ-స్కూటర్‌'ను జనవరి నుంచి భారతదేశం అంతటా కెటిఎం (KTM) డీలర్‌షిప్‌ల ద్వారా రిటైల్ చేస్తామని వెల్లడించారు. ఇ-స్కూటర్ కోసం బుకింగ్స్ కూడా జనవరి నుంచే ప్రారంభమవుతాయని ఆయన స్పష్టం చేశారు.

రీలాంచ్ చేయబడుతున్న ఈ స్కూటర్ కూడా అసలు చేతక్‌ను గుర్తుకు తెచ్చేలా పెద్ద బాడీ ప్యానెల్‌లతో రెట్రో-స్టైలింగ్‌ను కలిగి ఉంది. ఇ-స్కూటర్ ఆధునిక డిజైన్, కాంటౌర్డ్ సీట్, మల్టీ-స్పోక్ వీల్, ఆరు ఆకర్శణీయమైన రంగుల్లో లభ్యమవుతూ మరెన్నో ఫీచర్లను కలిగి ఉంది..

ఫీచర్-ఫ్రంట్‌లో, చేతక్ యొక్క ఎలక్ట్రిక్ రూపానికి గుర్రపు నాడ ఆకారంలో ఉన్న ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్, డిఆర్‌ఎల్‌లు, మృధువైన-టచ్ అనుభవాన్నిచ్చే ఎలక్ట్రానిక్ స్విచ్‌లు మరియు సీక్వెన్షియల్ ఎల్‌ఇడి బ్లింకర్లు, పెద్ద డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, గ్లోవ్ బాక్స్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

4 కిలోవాట్ల బ్యాటరీ మోటారుతో నడిచే ఈ స్కూటర్ "స్పోర్ట్ మరియు ఎకో" అనే రెండు రైడింగ్ మోడ్‌ల సదుపాయాలు కలిగి ఉంది. రైడింగ్ మోడ్‌ల ఎంపిక ప్రకారం వరుసగా 85 కిలోమీటర్లు మరియు 95 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు.

స్కూటర్‌లో ఐపి 67 రేటెడ్ హైటెక్ లిథియం-అయాన్ బ్యాటరీ అమర్చబడి ఉంటుంది, దీనిని సాధారణ గృహావసరాల్లో వినియోగించే 5-15 amp ఎలక్ట్రికల్ అవుట్‌లెట్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు.

ఇక ధరల విషయానికొస్తే, బజాజ్ ఇ-స్కూటర్‌ రూ .1 లక్ష నుండి 1.5 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుందని బజాజ్ ఆటో చైర్మన్ రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు.