టీవీఎస్ కంపెనీ (TVS Motors) నుండి సరికొత్తగా మరో బైక్ రాబోతున్నది. ఈ బైక్ ఇప్పటికే మార్కెట్లో విడుదలైన 'అపాచీ ఆర్‌టీఆర్ 200 ఎఫ్‌ఐ' (Apache RTR 200 FI) మరో వేరియంట్ అనిచెప్పవచ్చు. E100 పేరుతో వస్తున్న ఈ బైక్ లో కొత్తగా ఎలాంటి మార్పులు చేయలేదు. లుక్ పరంగా, ఫీచర్స్ పరంగా అన్నీ అపాచీ ఆర్‌టీఆర్ 200 ఎఫ్‌ఐ లాగానే ఉంటుంది. కాకపోతే ఇందులో విశేషమేముందంటే ఈ E100 బైక్ 85% ఇథనాల్, 15% పెట్రోల్ తో నడిచే బైక్. కాబట్టి దానికనుగుణంగా ఈ బైక్ ఇంజిన్ కూడా మెకానికల్ గా మార్పు చేయబడింది. ఇండియాలో ఇథనాల్ పవర్ తో నడిచే మొట్టమొదటి బైక్ కూడా ఇదే
RTR 200 FI కి E100కి మధ్య తేడా గమనించాలంటే ఈ E100 బైక్ కలర్ వైట్ మరియు లైమ్ గ్రీన్ షేడ్లతో ఉంటుంది. అలాగే ఇథనాల్ నింపుకునే విధంగా ఫ్యుఎల్ ట్యాంక్ మార్పు చేయబడి ఉంటుంది. ఇక మిగతాదంతా దాదాపు సేమ్ టూ సేమ్.
ఈ ఇథనాల్ బైక్ ద్వారా దీని ఇంజిన్ నుండి విడుదలయ్యే పొగలో ఇది కార్బన్ మోనాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్ లాంటి వాయువులు చాలా తక్కువ మోతాదులో ఉంటాయని తద్వార ఇది పర్యావరణానికి మేలు కలుగజేసే మోటార్ సైకిల్ గా నిలుస్తుందని టీవీఎస్ సంస్థ వెల్లడించింది.
ఇక TVS Apache RTR FI E100 ఇతర విశిష్టతలు ఇలా ఉన్నాయి...
ఇంజిన్ సామర్థ్యం 197.74 సిసి
సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్
21 PS పవర్ మరియు 18.1 Nm టార్క్
గేర్లు -5
ముందువైపు 270 mm, వెనక 240 mm తో పెటల్ డిస్క్ బ్రేక్స్
మైలేజ్ లీటరుకి 45 కి.మీ
ధర: రూ.1.20 లక్షలు (ఎక్స్ షోరూం)
ఇథనాల్ ఎక్కడ దొరుకుతుంది?
ఈ బైక్ నడవాలంటే ఇథనాల్ కావాలి, మరి ఇథనాల్ లభ్యత ఉందా? ఇథనాల్ ఉత్పత్తిలో బ్రెజిల్ తర్వాత ప్రపంచంలోనే ఇండియా రెండో స్థానంలో ఉంది. చక్కెర ఫ్యాక్టరీలలో ఇది లభ్యమవుతుంది. బయట మార్కెట్లలో ఇది లభించదు. అయితే పెరుగుతున్న పెట్రోల్ ధరల దృష్ట్యా భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు దృష్టి పెట్టింది. అందులో భాగంగానే వాహనాల కోసం ప్రభుత్వమే ఈ ఇథనాల్ ను అందరికీ అందుబాటులోకి తీసుకురాబోతుంది.