Dalal Street | (Photo Credits: ANI/IANS)

Mumbai, March 13:  కరోనావైరస్ భయం (Coronavirus Scare) ప్రపంచ మార్కెట్లను శాసిస్తుంది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద కరిగిపోతుంది. గురువారం భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు (Stock Markets) శుక్రవారం ఉదయం నుంచి కూడా అదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి. సూచీలన్నీ భారీ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ (Sensex) 2,696.57 పాయింట్లు నష్టపోయి, 8.23 శాతం పతనంతో 30,081.57 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ(Nifty) , 966.10 పాయింట్లు కోల్పోయి 10.07 శాతం క్షీణతతో 8,624.05 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయింది, నష్టాలు విపరీతంగా కొనసాగుతుండటంతో ట్రేడింగ్‌ను 45 నిమిషాల పాటు నిలిపివేశారు. అనంతరం ఉదయం 10:20 తర్వాత ట్రేడింగ్ పున: ప్రారంభమైంది. ఇప్పుడు మార్కెట్లు ఎలా పని చేస్తాయనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.

ఉదయం 10:50 వద్ద మార్కెట్లలో కొంచెం అనుకూలత కనిపించింది. సెన్సెక్స్ స్వల్పంగా 160 పాయింట్లు లాభపడి 32,939 వద్ద ట్రేడ్ అవుతోంది, నిఫ్టీ కూడా 38 పాయింట్లు పెరిగి 9,628 వద్ద ట్రేడ్ అవుతోంది.

నివేదికల ప్రకారం, భారత మార్కెట్లు గత 12 సంవత్సరాలలో ఎన్నడూ చూడని పతననాన్ని చవిచూస్తున్నాయి. శుక్రవారం యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ 74.19 వద్ద ట్రేడ్ అవుతుంది.

ప్రపంచ మార్కెట్లు కూడా గురువారం భారీగా పడిపోయాయి. డౌ జోన్స్ (యూఎస్) 1987 నాటి 'బ్లాక్ మండే' తరువాత అత్యధిక పతనాన్ని గురువారం నమోదు చేసింది. ఇండెక్స్ 22 శాతం క్షీణించింది.

కరోనావైరస్ ప్రపంచ మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన తర్వాత భారత్ సహా ప్రపంచ దేశాలు వణుకుతున్నాయి. మొన్న యూకే ఆరోగ్య శాఖ మంత్రికి , తాజాగా కెనడా ప్రధాని భార్యకు కూడా కరోనావైరస్ సోకిందంటే పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. కరోనావైరస్ ద్వారా భారత్ లో గురువారం తొలి మరణం సంభవించింది. మరియు దేశవ్యాప్తంగా కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 78కి పెరిగింది. ఈ భయాందోళనల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడింది, ఆర్థిక మాంద్యం మరింత పెరిగే అవకాశాలున్నాయన్న విశ్లేషణలతో మార్కెట్లు విలవిలలాడుతున్నాయి.