Mumbai, October 09: భారత టెలికాం మార్కెట్లోకి జియో నెట్‌వర్క్ (Jio Telecommunications company) ప్రవేశం ఒక సంచలనం. అప్పటివరకూ వివిధ నెట్‌వర్క్స్ లో ఉన్న వివిధ రకాల రీచార్జ్‌లు , ఎప్పుడో పండగకోసారి వచ్చే ఆఫర్లు, ఎక్సైరీ డేట్లతో కింద మీదపడే వినియోగదారులకు జియో 'ఆల్ ఫ్రీ & అన్ లిమిటెడ్' ఆఫర్లతో పెద్ద రిలీఫ్ ఇచ్చింది. దీంతో ఇతర నెట్‌వర్క్స్‌కి చెందిన కస్టమర్స్ అందరూ జియోకి షిఫ్ట్ అయ్యారు. జియో దెబ్బకి ఇతర ప్రైవేట్ టెలికాం సంస్థలు గల్లంతయ్యాయి, నెట్‌వర్క్స్ అన్నీ ఒక దాంట్లో మరొకటి విలీనం అయి మెల్లగా ఎలాగో అలా నెట్టుకొస్తున్నాయి. ఇప్పుడు 35 కోట్ల సబ్‌స్క్రైబర్స్‌తో ఇండియాలో నెంబర్ వన్ నెట్‌వర్క్ జియోనే.
కాగా, ఇప్పటివరకూ రీఛార్జిలు మరిచిపోయిన కస్టమర్లకు జియో షాక్ ఇచ్చింది. ఒకసారి రీచార్జ్ చేస్తే పరిమిత కాలం వరకు అపరిమిత ఫోన్ కాల్స్, లిమిటెడ్ ఇంటర్నెట్ అందిస్తున్న జియో నెట్‌వర్క్, ఇకపై జియో నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లే ఫోన్ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చొప్పున ఛార్జ్ (IUC- Interconnect Usage Charge)చేయబోతున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 10 తర్వాత రీఛార్జ్ చేసుకునే వారికి ఈ ఛార్జీలు అమలవుతాయని పేర్కొంది. అయితే ఇన్‌కమింగ్ కాల్స్ కి, ల్యాండ్‌లైన్స్‌కి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయమని స్పష్టం చేసింది.
జియో నుంచి ఇతర నెట్‌వర్క్స్‌కు మాత్రమే ఈ ఛార్జీలు వర్తిస్తాయి, అంటే మీరు జియో కస్టమర్ అయి ఉండి ఎయిర్‌టెల్ , వోడాఫోన్ లేదా మరేదైనా నెట్‌వర్క్ కి వాయిస్ కాల్ చేస్తే నిమిషానికి 6 పైసల చొప్పున డబ్బు కట్ అవుతుంది. ఇందుకోసం కొత్త టాప్‌అప్ (Top-ups) వోచర్లను కూడా ప్రవేశపెట్టింది. జియో నుంచి జియోకి మాత్రం ఉచితం, వాట్సాప్ కాల్స్ కు కూడా ఎలాంటి ఛార్జ్ ఉండదు.
ఇతర నెట్ వర్క్స్ కారణంగా ట్రాయ్ (TRAI) నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియో నెట్‌వర్క్ ఒక ప్రకటనలో తెలిపింది. IUC ఛార్జీలకు బదులుగా వసూలు చేసిన మొత్తానికి డేటాను ఉచితంగా అందిస్తామని వెల్లడించింది. గత మూడేళ్లలో IUC ఛార్జీల కింద ఎయిర్ టెల్, వోడాఫోన్ మరియు ఐడియా లాంటి కంపెనీలకు జియో నెట్ వర్క్ రూ. 13,500 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది.
జియో కొత్తగా ప్రవేశ పెట్టిన టాపప్ వోచర్ల వివరాలు ఇలా ఉన్నాయి
- Rs 10 ప్లాన్ తో 124 నిమిషాల టాక్ టైం మరియు 1 జిబి డేటా
-Rs 20 ప్లాన్ తో 249 నిమిషాల టాక్ టైం మరియు 2 జిబి డేటా
-Rs 50 ప్లాన్ తో 656 నిమిషాల టాక్ టైం మరియు 5 GB డేటా
-Rs 100 ప్లాన్ తో 1,362 నిమిషాల టాక్ టైం మరియు 10 జిబి డేటా
ప్రస్తుతానికి టారిఫ్ వివరాలు ఇలా ఉన్నాయి 2020 జనవరి నుంచి IUC చార్జీలు మారే అవకాశం ఉంది. ఒకవేళ IUC ఛార్జీలను TRAI ఎత్తివేసిన పక్షంలో జియో ఫోన్ కాల్స్ పై ఛార్జీలు రదు చేస్తుందా? లేక లాభాలు వస్తే కంటిన్యూ చేస్తుందా అనేది చూడాలి.