Mumbai, December 17: ఇకపై రోజులో ఏ సమయంలోనైనా నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT) ప్రక్రియ ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బును ఎటువంటి పరిమితి లేకుండా ట్రాన్స్ ఫర్ చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చేసింది. డిసెంబర్ 16 నుంచే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఉదయం 12:00 నుండి NEFT 24x7 ప్రాతిపదికను అమలులోకి తెచ్చింది.
దీని ప్రకారం 24 గంటలు, 365 రోజులు (బ్యాంక్ సెలవు దినాలలో కూడా) NEFT ద్వారా డబ్బు పంపించుకోవచ్చు. ఇదివరకు ఉదయం 8 నుండి సాయంత్రం 6:30 వరకే, అది కూడా బ్యాంకులు తెరిచిన రోజులలో మాత్రమే డబ్బు ట్రాన్స్ ఫర్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ సమస్య అధిగమించినట్లయింది. డిజిటల్ లావాదేవీలు, డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఈ ముందడుగు వేసింది.
NEFT Limit:
NEFT ద్వారా నగదు ట్రాన్సాక్షన్ కు కనీస పరిమితి అంటూ ఏమి లేదు అయితే సాధారణంగా రూ .2 లక్షల వరకు NEFT ద్వారా నగదు బదిలీలకు అనుమతించబడుతుంది. అయా బ్యాంకులను బట్టి పరిమితి నిర్ధారించబడి ఉంటుంది. ఉదాహరణకు, ఐసిఐసిఐ బ్యాంక్ రూ. 10 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు NEFT బదిలీలను అనుమతిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా రూ. 25 లక్షల పరిమితిని కలిగి ఉండగా, ఎస్బీఐ రూ. 10 లక్షల వరకు అనుమతిస్తుంది. ఇక ఈ పరిమితికి మించి పెద్ద మొత్తంలో నగదు బదిలీలు జరపాల్సి వస్తే, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS) ఉపయోగించాల్సి ఉంటుంది.
ప్రతి NEFT లావాదేవీలకు సంబంధించి, జమ కాబడిన మొత్తాన్ని బ్యాంకులు తమ వినియోగదారులకు ఖచ్చితమైన నిర్ధారణ సందేశాన్ని పంపిస్తాయి.
NEFT Charges:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ), ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సహా ఇతర బ్యాంకులు నెఫ్ట్ ద్వారా జరిపే నగదు బదిలీలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవు. ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది జూలై నెలలోనే NEFT మరియు RTGS ద్వారా నిధుల బదిలీపై ఆర్‌బిఐ అన్ని ఛార్జీలను మాఫీ చేసింది.
2020 జనవరి నుంచి సేవింగ్స్ బ్యాంక్ ఖాతా వినియోగదారులకు కూడా నెఫ్ట్ లావాదేవీలను ఉచితం చేయాలని సెంట్రల్ బ్యాంక్ బ్యాంకులను ఆదేశించినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.
NEFT Timings:
NEFT బదిలీలు రోజులో అర్ధగంటకో బ్యాచ్‌లుగా విభజించబడ్డాయి. ఈ NEFT చక్రం రౌండ్-ది-క్లాక్ పనిచేస్తుంది. మొదటి బ్యాచ్ ఉదయం 12:30 AM ప్రారంభమవుతుంది, రోజులో చివరి బ్యాచ్ 11:30 PM ముగుస్తుంది. అంటే 11:30 తర్వాత జరిపే లావాదేవీలు కొద్దిసేపు అనుమతించబడవు, మరుసటి రోజు తేదీ మారగానే మళ్ళీ అనుమతించబడతాయి.
ప్రస్తుతం మొబైల్‌లో ఉండే పలు రకాల డిజిటల్ యాప్స్ ద్వారా ఎప్పుడంటే అప్పుడు డబ్బు పంపించుకునే వీలుంది కానీ, పెద్ద మొత్తంలో ట్రాన్సక్షన్స్ చేయాలంటే నెఫ్ట్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది.