Stock Market (Photo credits: PTI)

Mumbai, March 9:  భారత్‌లో కరోనావైరస్ వ్యాప్తి చెందుతోందన్న భయాందోళనల నడుమ (COVID 19 Concerns) దాని ప్రభావం స్టాక్ మార్కెట్ (Stock Market) పై పడింది. సోమవారం స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్  (Sensex) సుమారు 6 శాతం వరకు పతనమైంది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి  1,941 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 35,634 వద్ద నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 9 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 7 శాతం, టాటా స్టీల్ 6 శాతం పతనంతో నష్టపోయిన షేర్ల సూచిలో అగ్రస్థానంలో కనిపించాయి.

ఇటు నిఫ్టీ (Nifty) కూడా 10 వేల దిగువనకు పడిపోయి, తర్వాత కాస్త పుంజుకుంది. అయినప్పటికీ, 538 పాయింట్లు నష్టపోయి 10,451 వద్ద నిలిచింది.

అలాగే, అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ కూడా పడిపోయింది. 52 వారాల కనిష్ఠానికి పతనమైన రూపాయి, సోమవారం ఒక యూఎస్ డాలర్‌కి 74.03 రూపాయలుకు చేరుకుంది.

యెస్ బ్యాంకు సంక్షోభం కూడా మార్కెట్ పై కనిపించింది. అయితే యెస్ బ్యాంకు షేర్లు సోమవారం లాభపడ్డాయి. యెస్ బ్యాంకుకు ఎస్బీఐ నిధులు మంజూరు చేస్తామని ప్రకటించిన తర్వాత యెస్ బ్యాంక్ షేర్లు 31 శాతం పెరిగాయి. అంతకుముందు శుక్రవారం యెస్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించడంతో వాటి షేర్లు 85 శాతం పడిపోయాయి.