Guntur Kaaram Review

మహేశ్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' చిత్రం (Guntur Kaaram) కలెక్షన్ల జోరు ప్రదర్శిస్తోంది. ఈ సినిమాకు తొలి షో నుంచే నెగెటివ్ రివ్యూలు వచ్చినా ఓపెనింగ్స్ మాత్రం తగ్గలేదు. మొదటి రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్ రూ.127 కోట్ల గ్రాస్ వసూలు చేసిన 'గుంటూరు కారం'... మూడో రోజూ కూడా అదే ఊపు కనబర్చింది. నిన్న ఒక్కరోజే రూ.37 కోట్ల గ్రాస్ రాబట్టింది.

మొత్తమ్మీద ఈ మూడ్రోజుల్లో మహేశ్ బాబు సినిమా రూ.164 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వెల్లడించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న 'గుంటూరు కారం' చిత్రంలో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. ఇందులో జగపతిబాబు, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైంది.

కుర్చీ మడతపెట్టి సాంగ్ కోసమైనా వెళ్లాల్సిందే, గుంటూరు కారం రివ్యూ ఇదిగో, త్రివిక్రం కలం ఘాటు తగ్గిందా, పెరిగిందా ఇక మీరే చెప్పండి

ఇదిలా ఉంటే ఎవరో పనిగట్టుకుని మహేశ్ బాబు కొత్త సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా, గుంటూరు కారం చిత్రానికి వ్యతిరేకంగా బుక్ మై షో టికెట్ పోర్టల్ లో 70 వేల నెగెటివ్ రేటింగ్ లు (70 thousand negative votes in BookMyShow) వచ్చినట్టు గుర్తించారు. దీనిపై చిత్రబృందం సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు (Guntur Kaaram Takes Legal Stand) చేసింది. తమ చిత్రానికి వ్యతిరేకంగా 'బుక్ మై షో' పోర్టల్ లో నెగెటివ్ ఓట్లు వేసి తమ చిత్ర ప్రతిష్ఠను దెబ్బతీశారని చిత్రబృందం తన ఫిర్యాదులో పేర్కొంది. 70 వేల బాట్ లను సృష్టించి రివ్యూలను తారుమారు చేసిన పరిస్థితి కనిపిస్తోందని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరింది.

గుంటూరు కారంకు రివ్యూ ఇచ్చేసిన నెటిజన్లు, సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయాలు వెల్లడిస్తున్న నెటిజన్లు

కాగా, గుంటూరు కారంపై నెగెటివ్ రేటింగుల విషయంలో ఫిలిం చాంబర్ కూడా జోక్యం చేసుకుంది. కేవలం మూడ్రోజుల వ్యవధిలో 70 వేల నెగెటివ్ రేటింగులు రావడం సందేహాస్పదంగా ఉందని, దీంట్లో నిగ్గు తేల్చాలని బుక్ మై షో పోర్టల్ నిర్వాహకులకు ఫిలిం చాంబర్ లేఖ రాసింది.