
అక్కినేని కుటుంబంలో మరో శుభకార్యం జరగబోతోంది. అక్కినేని మేనల్లుడు, హీరో సుమంత్ త్వరలోనే రెండో పెళ్లి (Actor Sumanth Second Marriage) చేసుకోబోతున్నాడు. తన కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే యువతి మెడలో ఆయన మూడుముళ్లు వేయనున్నారట.ఇరు కుటుంబపెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారట. వెడ్డింగ్ కార్డులు (Hero Sumanth Wedding Card) కూడా పంచి పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు సుమంత్-పవిత్రలకు సంబంధించిన ఓ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ (Wedding Card Goes Viral in Social Media) అయింది. ఈ పెళ్లి కార్డులను SP(సుమంత్-పవిత్ర) అనే అక్షరాలను హైలైట్ చేస్తూ తీర్చిదిద్దారు. సుమంత్ పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అనేది మాత్రం తెలియరాలేదు. అయితే త్వరలోనే సుమంత్ మీడియా ముఖంగా తన పెళ్లి గురించి అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
కాగా, సుమంత్‌కు హీరోయిన్ కీర్తిరెడ్డితో గతంలోనే వివాహమైన విషయం తెలిసిందే. కొన్నేళ్ల పాటు వారిద్దరి దాంపత్య జీవితం కొనసాగింది. వ్యక్తిగత విభేదాలు రావడంతో సుమంత్, కీర్తీ రెడ్డి విడిపోయారు. ఆ తర్వాత కీర్తీ రెడ్డి రెండో వివాహం చేసుకొని బెంగళూరులో స్థిరపడ్డారు. కానీ సుమంత్ మాత్రం ఒంటరిగానే జీవితం గడుపుతున్నారు.
రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'ప్రేమకథ'తో హీరోగా మారి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, అక్కినేని నాగార్జున మేనల్లుడిగా చిత్ర పరిశ్రమకి పరిచయమైన సుమంత్.. హీరోయిజం, మాస్ మసాల అంశాలను పక్కనబెట్టి విభిన్న కథలు ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ‘స్నేహమంటే ఇదేరా’, ‘సత్యం’, ‘గోదావరి’, ‘గోల్కోండ హైస్కూల్’ చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే వరుస పరాజయాల అనంతరం ‘మళ్లీరావా’ సినిమాతో సుమంత్ పాజిటివ్ టాక్ అందుకున్నారు. ఇటీవలే 'కపటదారి' సినిమాతో వచ్చి ఆకట్టుకున్న సుమంత్, ప్రస్తుతం 'అనగనగా ఒక రౌడీ' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో వాల్తేరు సీనుగా ఊరమాస్ గెటప్‌లో కనిపించనున్నాడు.