Megastar Chiranjeevi Among the Inconvenienced Passengers After Hyderabad-Bound Air Vistara Flight Suffers Technical Issues Mid-Air.

Mumbai, August 31: శుక్రవారం రోజు ముంబై నుంచి హైదరాబాద్ బయలుదేరిన విస్తారా ఎయిర్ లైన్స్ (Vistara Airlines) కు చెందిన విమానం ముంబై నుంచి టేకాఫ్ అయిన చాలాసేపటి నాటకీయ పరిణామాల మధ్య తిరిగి ముంబైలోనే ల్యాండ్ అయింది. ఈ విమానంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సహా మొత్తం 120 పైగా మంది ప్రయాణికులు ఉన్నారు. అందులోని ఒక ప్రయాణికుడు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను అప్పటికప్పుడే 'లేటెస్ట్‌లీ' మీడియాకు వివరాలను పంపించారు. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

ఆ వివరాల ప్రకారం, ముంబై నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన విస్తారా ఎయిర్ లైన్స్ కు చెందిన 'UK-869' విమానం ఆగష్టు 30న మధ్యాహ్నం 2:55 సమయానికి బయలుదేరాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం 3:30 సమయానికి టేక్-ఆఫ్ అయిన విమానం దాదాపు 30 నిమిషాల పాటు ప్రయాణించింది. సుమారు 10 వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు విమానంలో కలిగిన సాంకేతిక లోపాన్ని పైలెట్ గుర్తించాడు. ఆ సమయంలో విమానం కొద్దిగా కుదుపులకు లోనైంది.

ఆ తర్వాత విమానం దిశను మార్చుకుని తిరిగి ముంబై వైపే ప్రయాణించింది. కానీ లోపలున్న ప్రయాణికులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సాధారణంగా విమానంలో ప్రయాణిస్తున్నపుడు ఎంత ఎత్తులో ఉన్నా, విమానం ఎంత స్పీడ్ తో వెళ్తుంది, ఎప్పటివరకు చేరుకుంటాం, వాతావరణంలో ఏమైనా మార్పులు చోటు చేసుకున్నాయా అనే విషయాలను పైలెట్ ప్రయాణికులకు వెల్లడిస్తాడు. అయితే అలాంటివేమి లేకుండా , ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విమానం తిరిగి మళ్ళీ ముంబైలోనే ల్యాండ్ అయింది. అప్పటివరకూ పూణెలో ఏమైనా ల్యాండ్ చేస్తున్నారా అని భావించిన ప్రయాణికులు అది ముంబై విమానాశ్రయమే అని గ్రహించి ఆశ్చర్యానికి లోనయ్యారు. అప్పుడు చెప్పాడు పైలెట్. విమానంలో సాంకేతిక లోపం వచ్చిందని, ఈ కారణంగా మళ్ళీ ముంబైకే తీసుకొచ్చినట్లు అనౌన్స్ చేశాడు.

ఆ తర్వాత కొద్దిసేపటికి, మరో విమానాన్ని సిద్ధం చేశారు. ప్రయాణికులందరినీ మరో విమానంలోకి మార్చారు. ఈ సమయంలో అందరూ తమ వారికి ఫోన్లు చేసి జరిగిన విషయాన్ని తెలియపరిచారు. అప్పటికే చిరంజీవి కోసం ప్రత్యేక కారును సిద్ధం చేశారు. ఆయన కూడా ఫోన్ లో బిజీబిజీగా కనిపించారు. చిరంజీవి వెంట ఆయన వ్యక్తిగత సిబ్బంది మినహా మిగతా కుటుంబ సభ్యులు ఎవరు లేరు. ఆయన చుట్టూ జరుగుతున్న హడావిడిని చూసి చిరంజీవిని గుర్తుపట్టారు. అప్పటికీ గాని ఆయన చిరంజీవే అన్న విషయం చాలా మంది గుర్తించలేదు. వెంటనే అందరూ తమ మొబైల్ ఫోన్లలో ఫోటోలు వీడియోలు తీసి అక్కడిక్కడే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. "సైరా" సినిమా ప్రమోషన్ కోసం చిరు ముంబై వెళ్లినట్లు తెలుస్తుంది.

Chiranjeevi in the Air Vistara flight.

ఆ తర్వత కొత్త విమానం ఏర్పాటు చేసి, ప్రయాణికులను అందరిని అందులోకి మార్చి తిరిగి హైదరాబాద్ రావటానికి 3 గంటల సమయం అదనంగా పట్టింది. 4:30 వరకు హైదరాబాద్ లో ల్యాండ్ కావాల్సిన విమానం, రాత్రి 7:30 నిమిషాలకు హైదరాబాద్ లో సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు కనెక్టింగ్ ఫ్లైట్స్ బుక్ చేసుకున్న వారు, మరియు వేరే ప్రాంతానికి వెళ్లాల్సిన వారు, సమయం మించిపోయిన కారణంగా తీవ్రంగా నష్టపోయారు. విమానంలో కూడా మిగతా ప్రయాణికులను ఆహరం మరియు ఇతర సౌకర్యాలు కల్పించే విషయంలో సిబ్బంది విఫలమయ్యారని ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ప్రకటించిన 'విస్తారా'.

విషయం మీడియాలో రావడంతో విస్తారా ఎయిర్ లైన్స్ "జరిగిన దానికి చింతిస్తున్నాం" అని మొక్కుబడిగా ప్రకటించింది, అయితే సాంకేతిక లోపం ఏమిటన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రయాణికులు అందించిన సమాచారం మేరకు, విమానం చాలా పాతదని,ఇటీవలే మూతబడ్డ 'జెట్ ఎయిర్ వేస్' విమానాలనే 'విస్తారా' గా పేరు మార్చి సర్వీసులు నడుపుతున్నట్లుగా తెలియజేశారు.