Hyderabad, August 2: ‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ఈయన ఆహార ప్రియుడన్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా అక్కడ స్థానిక వంటలు, రుచులను ఆస్వాదిస్తాడు. ఈ క్రమంలో ‘సీతారామం’ సినిమా ప్రమోషన్ కోసం తెలుగు రాష్ట్రాలకు వచ్చిన దుల్కర్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. హైదరాబాద్ లో హలీమ్ అంటే తనకు ఎంతో ఇష్టమన్న దుల్కర్.. హీరో అఖిల్ రంజాన్ టైమ్ లో ప్రత్యేకంగా హలీమ్ ను తన కోసం ప్రత్యేకంగా పంపిస్తాడని చెప్పారు. ఇండియాలో ఎక్కడ వున్నా, విదేశాల్లో వున్నా కూడా అఖిల్ నుంచి హలీమ్ తనకు తప్పనిసరిగా అందుతుందని ఉత్సాహంగా చెప్పాడు. అఖిల్.. హలీమ్ ను ప్యాక్ చేసే విధానం తనకు బాగా నచ్చుతుందని మురిసిపోయాడు.
కాగా, ‘సీతారామం’ సినిమా ప్రమోషన్ టూర్ నిమిత్తం దుల్కర్ కోసం ఏకంగా చార్టర్ ఫ్లయిట్ నే ఏర్పాటు చేసారు ఆ సినిమా నిర్మాతలు. వచ్చే శుక్రవారం ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనున్నది.