Writer Sri Ramana Passes Away

Hyderabad, July 19: ఇటీవల సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖులు మరణించి విషాదం నింపారు. తాజాగా టాలీవుడ్ లో మరో ప్రముఖ రచయిత కన్నుమూశారు. బాపు, రమణ, తనికెళ్ళ భరణి.. లాంటి పలువురు రచయితలు, దర్శకుల వద్ద పనిచేసిన సీనియర్ రచయిత శ్రీరమణ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీ రమణ నేడు జులై 19 తెల్లవారుజామున 5 గంటలకు మరణించారు. 70 ఏళ్ళ వయసులో కన్నుమూశారు శ్రీ రమణ. దీంతో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

బాపట్ల జిల్లా వేమూరు మండలం వరహాపురంలో శ్రీరమణ జన్మించారు. అక్కడే ఫస్ట్‌ ఫారమ్‌లో చేరిన శ్రీరమణ.. తర్వాత బాపట్ల ఆర్ట్స్‌ కాలేజీలో పీయూసీ పూర్తి చేశారు. అనంతరం నవ్య వార పత్రికకు ఎడిటర్‌గానూ ఆయన పనిచేశారు. పేరడి రచనలతో గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీరమణ జర్నలిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి అనంతరం నవ్య వార్తాపత్రికకు ఎడిటర్ గా పనిచేసి, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి కథా రచయితగా, డైలార్ రైటర్ గా పనిచేశారు. తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాకు కథ అందించింది ఈయనే. ఆ సినిమా శ్రీ రమణకు ఎంతగానో పేరు తెచ్చింది.