స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొంచెం గ్యాప్ తీసుకొని, లేటైనా లేటెస్ట్‌గా ఒక కొత్త సినిమాతో ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నాడు. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో చిత్రం ఇది. ఈ సినిమా టైటిల్ 'అల వెంకఠపురములో' అని ఖరారు చేశారు. ఈ టైటిల్ గమనిస్తే ఏదో పురాణ సినిమాలలో గంధర్వ లోకాలను పద్య రూపంలో వివరించే శబ్దంలా అనిపిస్తుంది.
మరొకటి కూడా గమనిస్తే ఈమధ్య త్రివిక్రమ్ తీసే సినిమా టైటిల్స్ అన్నీ 'అ' అనే అక్షరంతోనే మొదలవుతున్నాయి. అతడు, అత్తారింటికి దారేది, అ.. ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత ఇప్పుడు అల వెంకఠపురములో.
ఆగష్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భాంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్ డైలాగ్ టీజర్ విడుదల చేశారు. ఇందులో అల్లు అర్జున్ చాలా సింపుల్‌గా, మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపిస్తున్నాడు. "ఏంట్రా గ్యాప్ ఇచ్చావ్" అంటే "ఇవ్వలా... వచ్చింది" అంటూ స్మార్ట్‌గా అల్లు అర్జున్ నుంచి మరో సినిమా ఎందుకు లేటయ్యిందో ఇండెరెక్ట్‌గా చెప్పేశారు. అల్లు అర్జున్ చివరగా 2018 లో 'నా పేరు సూర్య' సినిమాలో నటించారు.
ఈ 'అల వెంకఠపురములో' సినిమాలో బన్నీకి జోడిగా పూజ హెగ్డే నటిస్తుంది. 'దువ్వాడ జగన్నాథం' సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి మళ్లీ ఈ సినిమాలో నటిస్తున్నారు. వీరితో పాటు టబు, జయరాం, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, నవదీప్, సుషాంత్ సహా మరెంతో మంది పాపులర్ యాక్టర్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు.