రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' (Kamma Rajyam Lo Kadapa Reddlu) ఈరోజు విడుదల కావాల్సి ఉండగా, అందుకు తెలంగాణ హైకోర్ట్ (High Court of Telangana) బ్రేక్ వేసింది. ఈ సినిమా టైటిల్ కమ్మ మరియు రెడ్డి సామాజిక వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని, అంతేకాకుండా చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ లాంటి నేతలను కించపరిచేలా ఈ సినిమాలో పాత్రలు ఉన్నాయని పిటిషనర్లు హైకోర్టుకు తెలపారు.
అయితే ఈ సినిమాకు ఇప్పటివరకు సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వలేదని అలాగే సినిమా టైటిల్ ను 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అని మారుస్తామని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్ట్, వారం రోజుల్లో ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును ధర్మాసనం ఆదేశించింది. అంతేకాకుండా సినిమాలోని వివాదాస్పద అంశాలకు సంబంధించి అభ్యంతరాలను స్వీకరించాలని సూచించింది. అలాగే టైటిల్ కూడా మార్చాలని నిర్ధేషించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.
అయితే వర్మ మాత్రం ఈ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. మీ కుటిల రాజకీయాలకు దండం పెట్టాలి, కమిడియన్ల కంటే లీడర్లే బెస్టు అనే లిరిక్స్ తో సాగే 'దండం' పాటను విడుదల చేశారు.
Dhandam Full Video Song:
కాగా, హైకోర్ట్ తాజా తీర్పుతో 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. కోర్ట్ ఆదేశాలతో సెన్సార్ బోర్డ్ ఈ సినిమాలో ఎన్ని కత్తెరలు వేస్తుందో చూడాలి.